అన్నా చెల్లెళ్ల అనుబంధం ఎంతో అనిర్వచనీయమైంది. కలిసి అల్లరి చేయాలన్నా.. ఒకరికొకరు తోడుగా నిలిచి మనసులోని భావాలు పంచుకోవాలన్నా ఈ బంధం తర్వాతే ఏ బంధమైనా అని చెప్పుకోవచ్చు. అమ్మలోని తొలి అక్షరం "అ".. నాన్నలోని రెండవ అక్షరం "న్న".. ఈ రెండు అక్షరాలు మిళితమై అందించే ప్రేమానురాగాల రూపమే "అన్న". అన్నాచెల్లెళ్ల బంధంతో పాటు.. అక్కా తమ్ముళ్ళ అనుబంధాలను కూడా ప్రధాన కథావస్తువుగా తీసుకొని టాలీవుడ్లో విడుదలైన చిత్రాలు అనేకం ఉన్నాయి. అందులో కొన్నింటిని గురించి రక్షా బంధన్ వేడుక సందర్భంగా మనం కూడా తెలుసుకుందామా..!
రక్త సంబంధం -1962లో నందమూరి తారకరామారావు, సావిత్రి అన్నా చెల్లెళ్ల పాత్రలలో నటించిన "రక్త సంబంధం" చిత్రం కుటుంబ బాంధవ్యాలకు అద్దం పట్టిన చిత్రంగా నిలిచింది. ప్రముఖ రచయిత ముళ్ళపూరి వెంకటరమణ ఈ చిత్రానికి సంభాషణలు రాయడం విశేషం. ఘంటసాల ఈ చిత్రానికి సంగీతం అందించారు. "చందురుని మించు అందమొలికించు ముద్దుపాపాయివే.. నిను కన్నవారింట కష్టముల నీడ కరగి పోయేనులే" అని చెల్లెలిపై ప్రేమతో అన్న పాడే అపురూప గీతం ఈ చిత్రంలోనిదే.
బంగారు గాజులు - 1968లో సి.ఎస్ రావు దర్శకత్వంలో వచ్చిన "బంగారు గాజులు" చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, విజయనిర్మల అన్నా చెల్లె్ళ్లుగా నటించారు. పూర్తిగా సిస్టర్ సెంటిమెంట్ మీద నడిచే ఈ చిత్రం అప్పట్లో పెద్ద హిట్ చిత్రంగా నిలిచింది. "అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి... కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది" అని సోదర బంధంలోని విలువను తెలిపే అనురాగ గీతం ఈ చిత్రంలోనిదే. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి ఈ గీతాన్ని రాయడం విశేషం.
చెల్లెలి కాపురం - 1971లో విడుదలైన "చెల్లెలి కాపురం" చిత్రంలో శోభన్ బాబు, మణిమాల అన్నాచెల్లెళ్లుగా నటించారు. ఓ రచయిత తన చెల్లెలి కాపురం సుఖంగా ఉండడం కోసం తన కలలు, ఆశలను ఎలా త్యాగం చేయడానికి ప్రయత్నిస్తాడన్నదే ఈ చిత్రకథ. కె.విశ్వనాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఉత్తమ చిత్రంగా నంది అవార్డు కూడా గెలుచుకుంది. కొసరాజు రాఘవయ్య రచించిన "భలే భలే మా అన్నయ్య" అనే సూపర్ హిట్ గీతం ఈ చిత్రంలోనిదే.
సీతమ్మ పెళ్లి - 1984లో విడుదలైన "సీతమ్మ పెళ్ళి" సినిమాకి దిగ్దర్శకులు బాపు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, రేవతి అన్నాచెల్లెళ్లుగా నటించారు. ఓ పల్లెటూరులో అన్నా చెల్లెళ్ల అనుబంధం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ చిత్రానికి యస్.పి.బాలసుబ్రహ్మణ్యం సంగీతాన్ని అందించడం గమనార్హం.
పల్నాటి పౌరుషం -1994లో విడుదలైన "పల్నాటి పౌరుషం" చిత్రంలో కృష్ణంరాజు, రాధిక అన్నాచెల్లెళ్లుగా నటించారు. కోడిపందేల వల్ల ఓ కుటుంబంలో బావ, బావమరుదుల మధ్య జరిగే గొడవలు ఎలాంటి మనస్పర్థలకు దారితీస్తాయో.. అన్నా చెల్లెళ్ళ బంధానికి ఎలాంటి తూట్లు పొడుస్తాయో అన్నదే ఈ చిత్ర కథాంశం. పూర్తిగా భావోద్వేగాలతో సాగే ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్‌ను బాగా పండించారు దర్శకులు. ముత్యాల సుబ్బయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ముద్దుల మావయ్య - 1989లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ, సీత అన్నాచెల్లెళ్లుగా నటించారు. తన సోదరికి జరిగిన అన్యాయానికి ఓ అన్న ఎలా పగ తీర్చుకుంటాడన్నదే ఈ చిత్రకథ. "మామయ్య అన్న పిలుపు, మా ఇంటా ముద్దులకు పొద్దుపొడుపు" అనే సూపర్ హిట్ గీతం ఈ చిత్రంలోనిదే.
హిట్లర్- 1997లో విడుదలైన "హిట్లర్" చిత్రంలో అయిదుగురు చెల్లెళ్ళకు అన్నయ్యగా మెగాస్టార్ చిరంజీవి నటించారు. అశ్విని, మీనా కుమారి, గాయత్రి, పద్మశ్రీ, శుభ, శ్రేష్ఠ ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెళ్ల పాత్రలను పోషించారు. ఎల్.బి.శ్రీరామ్ ఈ చిత్రానికి సంభాషణలు రాయడం గమనార్హం. ముత్యాల సుబ్బయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
అర్జున్ - 2004లో విడుదలైన "అర్జున్" చిత్రంలో మహేష్ బాబు, కీర్తి రెడ్డి అన్నాచెల్లెళ్లుగా నటించారు. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సెంటిమెంట్ చిత్రంలో తన సోదరికి శత్రువుల వల్ల ఎలాంటి ప్రమాదం జరగకుండా కంటికి రెప్పలా కాపాడుకొనే ఓ తమ్ముడి పాత్రలో మహేష్ బాబు కనిపిస్తారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
పుట్టింటికి రా చెల్లి..! - 2004లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో అర్జున్, మధుమిత అన్నాచెల్లెళ్లుగా నటించిన ఈ చిత్రం పూర్తిస్థాయి సిస్టర్ సెంటిమెంట్ చిత్రం అని చెప్పవచ్చు. బి,సి సెంటర్స్‌లో దుమ్మురేపిన ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకొని 100 రోజులకు పైగా ఆడింది.
అన్నవరం - 2006లో విడుదలైన "అన్నవరం" చిత్రంలో పవన్ కళ్యాణ్, సంధ్య అన్నాచెల్లెళ్ళ పాత్రలలో నటించారు. భీమనేని శ్రీనివాసరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. "అన్నయ్య అన్నావంటే ఎదురవనా.." అంటూ సాగే సూపర్ హిట్ సెంటిమెంట్ సాంగ్ ఈ చిత్రంలోనిదే. సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.
రాఖీ - 2006లో జూనియర్ ఎన్టీఆర్, మంజుష అన్నా చెల్లెళ్ళుగా నటించిన ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. వరకట్న వేధింపులకు గురై తన సోదరి మరణించాక.. ఆడపిల్లలను వేధింపులకు గురిచేసే వారిని అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న రాఖీ అనే యువకుడి కథే ఇది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి.
గోరింటాకు - 2008లో విడుదలైన "గోరింటాకు" చిత్రంలో రాజశేఖర్, మీరా జాస్మిన్ అన్నాచెల్లెళ్లుగా నటించారు. వి.ఆర్.ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అన్నా చెల్లెళ్ళ సెంటిమెంట్‌తో సాగే ఈ చిత్రం కూడా బాక్సాఫీసు వద్ద సక్సెస్ అయ్యింది.