Bandi Sanjay About PM Modi Meeting: " ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా గొప్ప మనిషి. నిరంతరం ప్రజల కోసం పరితపించే వ్యక్తి. రాత్రింబవళ్లు కష్టపడే నాయకుడు. రేపు ఓకేరోజు మూడు రాష్రాల్లో పర్యటించి బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు. అందులో భాగంగా తెలంగాణలోని హన్మకొండలో జరగబోయే బహిరంగ సభను కనీవినీ ఎరగని రీతిలో సక్సెస్ చేసి చరిత్ర సృష్టించాలి " అని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బహిరంగ సభల్లో కొందరు టీఆర్ఎస్ నేతలు పెయిడ్ ఆర్టిస్టులను ప్రత్యేకంగా పెట్టి జై జై అంటూ నినాదాలు చేయించుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారని... అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని బండి సంజయ్ సూచించారు.
హన్మకొండ జిల్లాకి చెందిన బీజేపీ ముఖ్య నాయకులతో బండి సంజయ్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు రావు పద్మ, మాజీ ఎమ్మెల్యే ధర్మా రావు, జిల్లా ఇంఛార్జ్ మురళీధర్ గౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ, కరీంనగర్ – వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనుల కోసం రూ.2146 కోట్లు కేటాయించారు. నాదే పెద్ద బడ్జెట్. నేను కరీంనగర్‌లోనే బహిరంగ సభ పెట్టొచ్చు అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
గుజరాత్‌లో పవర్ ఇంజిన్ తయారు చేసే లోకో యూనిట్ ఉంది. ఇక్కడ వస్తువులు తీసుకుపోయే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతున్నాం. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయి అని అన్నారు. అయినప్పటికీ కేంద్రం ఏర్పాటు చేయబోతోన్న కోచ్ ఫ్యాక్టరీపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయి. కానీ వారి ప్రచారాన్ని తిప్పికొడుతూ, గతంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం వరంగల్ జిల్లాకు చేసిందేమీ లేదు. బీఆర్ఎస్ ఈ జిల్లాలో పెద్ద పరిశ్రమలు తెచ్చిందేమీ లేదు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అని బండి సంజయ్ స్పష్టంచేశారు.
అందుకు వేదికగా జరగబోయే ప్రధాని మోదీ బహిరంగ సభను కనివినీ ఎరగని రీతిలో ప్రజలను సమీకరించడమే కాకుండా... నిర్ణీత సమయానికంటే ముందే వచ్చి సభను సక్సెస్ చేయాలి అని పిలుపునిచ్చారు. తెలంగాణలో రెండేళ్లలో ఏకంగా 18 బహిరంగ సభలు నిర్వహించిన చరిత్ర బీజేపీకి ఉంది. దేశంలోనే తక్కువ సమయంలో ఇన్ని సభలు నిర్వహించిన దాఖలాల్లేవు. హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో రేపు జరగబోయే మోదీ సభను సైతం కనీవినీ ఎరగని రీతిలో విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఒక్కో కార్యకర్త కనీసం 50 మందిని సభకు తీసుకురావాలి. అదే విధంగా ఒక్కో డివిజన్ నుండి 2 వేల మందిని సభకు హాజరయ్యేలా చూడాలి. మోదీ..మోదీ... బీజేపీ నినాదాలతో ఓరుగల్లు మొత్తం మారుమోగాలి అని వరంగల్ ప్రజానికానీకి పిలుపునిచ్చారు.
తెలంగాణలో బీజేపీ యాడ ఉందని మొరిగే వాళ్లకు మోదీ సభ సక్సెస్‌తోనే సమాధానం చెప్పాలి. దీంతో పాటు బీఆర్ఎస్ పార్టీతో బీజేపీ కుమ్మక్కైందనే దుష్ప్రచారాన్ని కూడా తిప్పికొట్టాలి అని అన్నారు. టీఆర్ఎస్ వాళ్లు ఓ వెయ్యి మంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి జై జై అన్పించేలా ప్లాన్ చేస్తున్నారు. అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. రేపు ఎలాంటి స్లోగన్స్ లేకుండా మోదీ గారి సభ సక్సెస్ చేసేలా చూడాల్సిన బాధ్యత మీపై ఉంది హన్మకొండ జిల్లాకు చెందిన నేతలు, కార్యకర్తలకు బండి సంజయ్ సూచించారు.