గతంలో టాలీవుడ్‌కు డ్రగ్ మాఫియాతో సంబంధాలున్నాయనే ఆరోపణల కింద పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసి, వారిని విచారించిన తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బెల్టు షాపులపై దృష్టిసారించింది. అందులో భాగంగానే నిన్న మంగళవారం ఒక్క రోజే రూ.50 లక్షల విలువైన మద్యాన్ని ధ్వంసం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ స్థానిక డిప్యూటీ కమిషనర్ల ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లో బెల్టు షాపులపై దాడులు చేసి, అక్రమంగా విక్రయిస్తున్న మద్యం బాటిళ్లు, విదేశీ లిక్కర్ పేరిట భారత్‌లోనే తయారవుతున్న మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలా రాష్ట్ర వ్యాప్తంగా స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యాన్ని పాత జిల్లా కేంద్రాల్లో ధ్వంసం చేశారు.
మద్యం అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట, గుడుంబా నియంత్రణ చర్యల కోసం ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం వంద రోజుల ప్రణాళికను రూపొందించుకుంది. ఆ ప్రణాళికలో భాగంగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఆదేశాల మేరకు అధికారులు ఈ దాడులు జరిపారు. ఈ దాడుల్లో రాష్ట్రవ్యాప్తంగా రూ.50 లక్షల విలువ చేసే 8435.83 లీటర్ల ఫారెన్ లిక్కర్ ( విదేశీ మద్యం పేరిట భారత్‌లోనే తయారైన నకిలీ సరుకు), 8283.74 లీటర్ల బీరును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యాన్ని కొంత జిల్లా కేంద్రాల్లోనే ధ్వంసం చేయగా ఇంకొంత మొత్తాన్ని నాగోలులోని మూసీ నది పక్కన మంగళవారం ధ్వంసం చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఖురేషి మీడియాకు తెలిపారు.