ఆదాయ పన్ను పరిమితి ఎందుకు పెంచలేదో అరుణ్ జైట్లీ మాటల్లోనే..

జీ న్యూస్‌కి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ

Last Updated : Feb 4, 2018, 04:25 PM IST
ఆదాయ పన్ను పరిమితి ఎందుకు పెంచలేదో అరుణ్ జైట్లీ మాటల్లోనే..

కేంద్రంలో అధికారంలో వున్న ఎన్డీఏ సర్కార్ ఎన్నికల పరీక్షకు వెళ్లడానికి ముందు చివరిసారిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ కావడంతో కచ్చితంగా ఈ బడ్జెట్‌తో అన్నివర్గాల వారికి కేంద్రం గాలం వేసే అవకాశాలు మెండుగా వున్నాయనే ప్రచారం జరిగింది. కానీ తీరా బడ్జెట్ ప్రవేశపెట్టాకా చూస్తే, సీన్ కాస్త రివర్స్‌గా కనిపించింది. అదృష్టవశాత్తుగా రైతాంగం, గ్రామీణాభివృద్ధిపై బాగానే ఫోకస్ చేసిన కేంద్రం.. మధ్య తరగతిని విస్మరించింది అనే అభిప్రాయం వ్యక్తమైంది. అన్నింటికిమించి ఈసారి బడ్జెట్‌లో కనిష్ట ఆదాయ పన్ను పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పెంచుతారనే అభిప్రాయం కూడా వినిపించింది. కానీ ఈ విషయంలోనూ చాలామంది ఆశలు అడియాశలే అయ్యాయి. 

ఇదే విషయమై తాజాగా జీ మీడియా గ్రూప్ ఛానెల్‌కి చెందిన జీ బిజినెస్ ఛానెల్‌కి ఎక్స్‌క్లూజీవ్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. "వేతన జీవులు మాత్రమే నిజాయితీగా పన్ను చెల్లిస్తున్నారు తప్పితే, మిగతా వాళ్లలో చాలామంది తమకు తాము పన్ను చెల్లించే పరిధిలోకి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అధిక మొత్తంలో ఖర్చులు చూపించి పన్ను బారి నుంచి తప్పించుకుంటున్నారు" అని అన్నారు. 

 

ఆదాయ పన్ను పరిమితి గురించి మరింత వివరిస్తూ.. "ఉదాహరణకు ఆదాయపన్ను పరిమితిని రూ. 2 లక్షలు పెంచినా.. పన్ను నుంచి తప్పించుకునే వాళ్లు మళ్లీ అంత మొత్తంలో ఖర్చులు చూపించి పన్ను నుంచి తప్పించుకుంటారు. ఒక వేళ మరో రూ.3 లక్షలు పెంచినా కూడా వాళ్లు అదేవిధంగా మరో రూ. 3 లక్షల అధిక ఖర్చులు చూపిస్తారు. ఎప్పుడూ జరుగుతోంది అదే. అందుకే తాము ఆదాయ పన్ను పరిమితిని పెంచకుండా నిజాయితీగా పన్ను చెల్లించే వేతన జీవులకి ప్రామాణిక తగ్గింపు లాంటి ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్లో ఉపశమనం కలిగేలా చూశాం" అని అన్నారు. 

Trending News