అయ్యప్ప గుళ్లోకి మహిళలను అడ్డుకోవడానికి ఆత్మాహుతి దళం సిద్ధం: శివసేన

'శబరిమలలోకి ప్రవేశిస్తే.. ఆత్మహత్యలకు సిద్ధం':శివసేన

Last Updated : Oct 13, 2018, 02:38 PM IST
అయ్యప్ప గుళ్లోకి మహిళలను అడ్డుకోవడానికి ఆత్మాహుతి దళం సిద్ధం: శివసేన

శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు అన్ని వయస్సుల మహిళలను అనుమతించాలన్న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కేరళ రాష్ట్రంలో ఆందోళనలు మిన్నంటాయి. ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలు దీనిపై ఉద్యమాన్ని ప్రారంభించాయి. ఈ క్రమంలో సీనీ నటుడు, బీజేపీ నాయకుడు కొల్లం తులసి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. శబరిమల ఆలయంలోకి ప్రవేశించే సాహసం చేసే మహిళలను నరికేస్తానంటూ వ్యాఖ్యలు చేశారు. అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించే మహిళలను నరికేసి  సగం ఢిల్లీకి మరో సగం కేరళ ముఖ్యమంత్రికి పంపిస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు.

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై శివసేన పార్టీ ఇప్పటికే తమ నిర్ణయాన్ని ప్రకటించింది. కేరళలో తమ పోరును ఉధృతంగా చేపట్టుతామని శివసేన పిలుపు ఇచ్చింది. తాజాగా శివసేన నాయకులు దీనిపై స్పందించారు. శబరిమలలోకి మహిళలు ప్రవేశించకుండా అడ్డుకోవడానికి తమ పార్టీ మహిళా కార్యకర్తలు ఆత్మాహుతి దళంగా ఏర్పడ్డారని కేరళ శివసేన నాయకుడు పెరింగమ్మళ అజి చెప్పారు. 'మా పార్టీ మహిళా కార్యకర్తలు అక్టోబరు 17 మరియు 18వ తేదీల్లో పంబ నది సమీపంలో ఆత్మాహుతి దళంగా వేచి ఉంటారు. శబరిమల అయ్యప్ప ఆలయంలో యవ్వన వయస్సులో ఉన్న ఏ మహిళైనా లోనికి ప్రవేశించినా మా కార్యకర్తలు ఆత్మహత్య చేసుకుంటారు' అని ఆయన చెప్పారు.

శబరిమల దేవాలయంలోకి స్త్రీలను అనుమంతిచడమంటే అయ్యప్ప పవిత్రతని, సాంప్రదాయాన్ని దెబ్బతీయడమేననీ నిరసనకారులు చెబుతున్నారు. కాగా, ఇప్పటికే సుప్రీం తీర్పుపై పలువురు రివ్యూ పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, శబరిమల తీర్పుపై అత్యవసరంగా రివ్యూ పిటిషన్‌లను విచారించాల్సిన అవసరం లేదని సుప్రీం వ్యాఖ్యానించింది.

అటు రాష్ట్రంలో శాంతిభద్రతలపై కేరళ సీఎం పినరాయి విజయన్ స్పందించారు. ఆరెస్సెస్, బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నాయని విజయన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసే ప్రసక్తే లేదన్నారు.

 

Trending News