"పద్మావతి" చిత్ర వివాదంపై మోడీకి లేఖ

   

Last Updated : Nov 12, 2017, 01:33 PM IST
"పద్మావతి" చిత్ర వివాదంపై మోడీకి లేఖ

ఉదయ్ పూర్ సంస్థానానికి చెందిన ఎంకే విశ్వరాజ్ సింగ్ త్వరలో విడుదల కానున్న "పద్మావతి" చిత్ర వివాదంపై ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులందరికీ లేఖ రాశారు. అలాగే సెన్సార్ బోర్డు అధ్యక్షుడు ప్రసూన్ జోషికి కూడా వినతి పత్రాన్ని అందించారు. అదే కాపీని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేతో పాటు పోలీసు అధికారులకు కూడా పంపించారు. వెంటనే "పద్మావతి" చిత్రానికి సంబంధించిన సెన్సార్ ప్రక్రియను ఆపేయాలని ఆయన కోరారు.

మన భారతీయ సంప్రదాయాలను కించపరిచే ఆ చిత్రాన్ని ఆపడం ప్రభుత్వ నైతిక బాధ్యత అని ఆయన తన లేఖలో పేర్కొనారు. ఇటీవలే ఈ చిత్రం విషయంలో ఎలాంటి చరిత్ర వక్రీకరణలకూ పాల్పడలేదని దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెలిపారు. అయితే విశ్వరాజ్ సింగ్ తన లేఖలో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ.. అసలు మేవాడ్ సంస్థానం నుండి అనుమతిని తీసుకోకుండా చిత్రాన్ని ఎలా తీస్తారని అడిగారు.

ఒక వర్గానికి చెందిన మనోభావాలు దెబ్బతీయడానికి ఎవరికీ హక్కు లేదని చెప్పారు. చిత్రంలో "గూమార్" అనే పాట చిత్రీకరణ రాణీ పద్మావతి ఇమేజ్ దెబ్బతీసే విధంగా ఉందని.. ఒక వేళ ఇలా చరిత్రను వక్రీకరించి సినిమాలు తీస్తే.. భావితరానికి చెడు సందేశం వెళ్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమాల్లో కమర్షియాలిటీకి పెద్దపీట వేయడం కోసం ఒక అత్యున్నత గౌరవానికి చిహ్నమైన పద్మావతి పాత్రకు అవమానం కలిగించేలా చిత్రీకరణ జరగడం ఆమోదయోగ్యం కాదని తెలిపారు.

అయితే భన్సాలీ తీస్తున్న ఇదే సినిమాపై బుండీ రాజ సంస్థానానికి చెందిన రాణీ మయూరి సింగ్ పాజిటివ్‌గా మాట్లాడారు. చిత్రం విడుదలయ్యాక, అభ్యంతరాలు ఉంటే అడగవచ్చని ఆమె తెలిపారు. దీపాకా పడుకొనే టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే శ్రీ రాజపుత్ కర్ని సేన మండిపడుతోంది. జైపూర్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు వారు సెట్స్ తగలబెట్టారు. అలాగే గత నెల దర్శకుడిపై దాడి చేయడానికి కూడా ప్రయత్నించారు. అయితే నిర్మాతలు ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ 1 డిసెంబరు, 2017 తేదీన విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. 

 

Trending News