పెట్రోల్ ధరలను తగ్గించాలని ఓ కేంద్ర మంత్రి రోడ్డెక్కారు. ఢిల్లీలో ఇంధన ధరలు పెరుగుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని రాజ్యసభ ఎంపీ, కేంద్ర మంత్రి విజయ్ గోయెల్ ధ్వజమెత్తారు. క్రేజీవాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ఆయన ఆదివారం నిరసన ప్రదర్శన చేపట్టారు. ఉదయం 11 గంటలకు ఎడ్లబండి మీద ఎక్కి నిరసన తెలిపారు. మార్చ్‌లో భాగంగా చాందినిచౌక్ వద్దకు చేరుకున్న ఆయన.. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. మిగితా రాష్ట్రాల మాదిరి ఢిల్లీ వాసులకు కూడా ఇంధన ధరల నుంచి ఉపశమనం కలిగించాలని కోరారు.
ఇటీవలే ఆకాశన్నంటుతున్న ఇంధన ధరలు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం.. ఇంధనాలపై ఉన్న ఎక్సైజ్ డ్యూటీని 1.50 మేర తగ్గించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా ఇంధన ధరలను రూ.1మేర తగ్గించారు. దీంతో మొత్తంగా పెట్రోల్, డీజిల్ ధరలపై సామాన్యుడికి రూ.2.50 మేర ఉపశమనం కలిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్ రూపంలో వసూలు చేస్తున్న పన్నులను రూ.2.50 మేర తగ్గించాలంటూ కేంద్ర ప్రభుత్వం కోరగా.. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ సహా బీజేపీ పాలిత రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించి సామాన్యుడికి కొంతమేర ఊరట కల్పించగా.. మిగతా రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
Union Minister Vijay Goel rode a bullock cart in Chandni Chowk demanding the Delhi Government reduce prices of fuel pic.twitter.com/kLLCsjIQsI
— ANI (@ANI) October 7, 2018
మళ్లీ పెరిగిన ఇంధన ధరలు
చమురు మార్కెటింగ్ సంస్థలు ఆదివారం మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయి. ఇవాళ ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 14 పైసలు పెరిగి రూ.81.82కి చేరింది. డీజిల్ 29 పైసలు పెరిగి రూ.73.53 అయింది. ముంబైలో పెట్రోల్ 14 పైసలు పెరిగి రూ.87.29కి, డీజిల్ 31 పైసలు పెరిగి రూ.77.06కి చేరింది. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరుగుతుండటంతో మళ్లీ వీటి ధరలు పెరుగుతూ వస్తున్నాయి.