రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో 20 మందికి ఫుడ్ పాయిజన్

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో 20 మందికి ఫుడ్ పాయిజన్

Last Updated : Apr 8, 2019, 12:51 PM IST
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో 20 మందికి ఫుడ్ పాయిజన్

బొకారో: న్యూఢిల్లీ నుంచి భువనేశ్వర్ బయల్దేరిన రాజధాని ఎక్స్ ప్రెస్ రైలులో ఆహారం తీసుకున్న వారిలో 20 మంది ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. ఆదివారం జరిగిన ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది జార్ఖండ్‌లోని బొకారొ రైల్వే స్టేషన్ లో రైలును నిలిపేసి బాధితులకు చికిత్స అందించారు. ఈ సందర్భంగా రైలు ప్రయాణికులు, రైల్వే సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వీవాదం చోటుచేసుకుంది. రైల్లో అందించిన ఆహారంలో నాణ్యత లోపించడంపై రైలు ప్రయాణికులు సిబ్బందిని నిలదీశారు.

ప్రయాణికులు వెల్లడించిన వివరాల ప్రకారం శనివారం సాయంత్రం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి  రైలు బయల్దేరిన అనంతరం రాత్రి వేళ రైలులో సిబ్బంది ఆహారాన్ని అందించినట్టు తెలుస్తోంది. బి 3, బి 5, బి 7, బి 9 బోగీల్లోని ప్రయాణికులకు ఆహారం తీసుకున్న అనంతరం కొద్దిసేపటికే అస్వస్థతకు లోనయ్యారు. కడుపులో నొప్పి, వాంతులు, విరేచనాలకు గురైన ప్రయాణికులు ఈ విషయాన్ని రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బొకారో రైల్వే స్టేషన్‌లో అధికారులు ప్రయాణికులకు చికిత్స అందే విధంగా ఏర్పాటు చేశారు. గంటపాటు రైల్వే స్టేషన్‌లోనే రైలును నిలిపేసిన అధికారులు.. బాధితులకు అందరికీ వైద్యం అందిందని నిర్ధారించుకున్న తర్వాతే రైలును ముందుకు కదలనిచ్చారు. దీంతో ప్రయాణికులు సైతం హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.

Trending News