నమస్కారంతో కూడిన సంస్కారం.. విద్యార్థులకు చేతులెత్తి మొక్కిన మాస్టారు

తమిళనాడులోని విల్లుపురానికి చెందిన హైస్కూలు ప్రిన్సిపల్ జి.బాలు ఓ నూతన విద్యావిధానానికి నాంది పలికారు. పిల్లలు ఇష్టంతోనే విద్యను నేర్చుకోవాలని... వారిని  మంచి మాటలతోనే దారిలోకి తీసుకురావాలన్నదే తన అభిమతమని తెలిపారు. 

Last Updated : Feb 5, 2018, 05:48 PM IST
నమస్కారంతో కూడిన సంస్కారం.. విద్యార్థులకు చేతులెత్తి మొక్కిన మాస్టారు

తమిళనాడులోని విల్లుపురానికి చెందిన హైస్కూలు ప్రిన్సిపల్ జి.బాలు ఓ నూతన విద్యావిధానానికి నాంది పలికారు. పిల్లలు ఇష్టంతోనే విద్యను నేర్చుకోవాలని... వారిని  మంచి మాటలతోనే దారిలోకి తీసుకురావాలన్నదే తన అభిమతమని తెలిపారు. కొట్టడం, తిట్టడం ద్వారా విద్యార్థులకు చదువు చెప్పలేమని అంటారు ఆయన.

అందుకే నమస్కారంలోనే సంస్కారముందని భావించిన ఆయన తన విద్యార్థులకు నవ్వుతూ నమస్కారం పెట్టడం ప్రారంభించారు. తద్వారా వారి గుండెల్లో ఎంతో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు. "ఉపాధ్యాయులంటే విద్యార్థులు భయపడే రోజులు కాదు మనకు కావాల్సింది.. వారిని ప్రేమించి, అభిమానించే రోజులు రావాలి"అని చెప్పే ఆయన తన సొంత డబ్బులు ఖర్చుపెట్టి విద్యార్థుల ఇంటికి వెళ్లి మరీ.. వారికి చదువు వల్ల ఎలాంటి ఉపయోగాలుంటాయో తెలియజేస్తున్నారు. 

విల్లుపురం హైస్కూలులో 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు క్లాసులు జరుగుతూ ఉంటాయి. దాదాపు 1000 మంది విద్యార్థులు ఆ హైస్కూలులో చదువుతున్నారు. వారందరినీ రోజూ క్రమం తప్పకుండా స్కూలుకి రప్పించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అయినా సరే.. పట్టువదలని విక్రమార్కుడిలా తన ప్రయత్నం తాను చేస్తున్నారు ప్రిన్సిపల్ జి.బాలు. విద్యార్థుల ఇంటికి వెళ్లి వారి తల్లిదండ్రులను పరిచయం చేసుకుంటారు. వారి సమస్యలు ఏమిటో అడిగి తెలుసుకుంటారు. విద్యార్థి స్కూలుకి రాకపోవడానికి కారణం ఏంటో కూడా తెలుసుకుంటారు. 

ఆ తర్వాత వారి సమస్యను బట్టి తనకు తోచిన సహాయం చేస్తుంటారు. విద్యార్థులకు ఆసక్తికరంగా పాఠాలు చెబితే.. నిజ జీవితంతో ముడిపడిన సంఘటనలు ఉదాహరణలుగా చెబుతూ వారికి పాఠాలు బోధిస్తే.. వారు తప్పకుండా స్కూలుకి వచ్చి తీరుతారని కచ్చితంగా చెబుతుంటారు జి.బాలు. స్కూలులో తన ఆధ్వర్యంలో ఎల్లప్పుడూ అలాంటి మంచి వాతావరణమే ఉండేటట్లు చూస్తున్నానని.. ఉపాధ్యాయులతో కూడా ఈ విషయాల గురించి మాట్లాడి వారు కూడా పిల్లలతో సహృదయ భావాన్ని పెంపొందించుకొనేటట్లు చేస్తున్నామని చెబుతుంటారు ఈ స్కూలు ప్రిన్సిపల్. 

Trending News