బడ్జెట్ రోజు వచ్చేస్తోంది. ఆ రోజు ప్రజలందరూ టీవీలకు అతుక్కుపోయి తమ దేశగమనానికి కేంద్రబిందువులుగా మారబోయే ఆదాయ, వ్యయాల గురించి ఆసక్తిగా వింటారన్న విషయంలో సందేహం లేదు. దాదాపు ఒక గంటపాటు సాగే ఈ ప్రసంగంలో ఆ సంవత్సరం దేశ భవిష్యత్ కార్యాచరణలతో పాటు వివిధ రాష్ట్రాలకు లభించబోయే రాయితీలు, ఫండ్స్, ప్యాకేజీల గురించి ఆర్థిక మంత్రి వివరిస్తారు. అలా ప్రసంగించడానికి ముందు ఆర్థిక మంత్రి బడ్జెట్ పత్రాలను రెడ్ సూట్ కేసులో ఎందుకు తీసుకొస్తారో మీకు తెలుసా.? ఆ సంప్రదాయం చాలా పాతది. దాని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది.
1860లో తొలిసారిగా బ్రిటన్ అధికారి విలియం ఎవర్ట్ గ్లాడ్ స్టోన్ భారత్కి వచ్చినప్పుడు ఫైనాన్షియల్ డాక్యుమెంట్లను లెదర్ బ్యాగులో తీసుకొచ్చాడు. ఆ తర్వాత భారత్లో ప్రతీ సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడల్లా లెదర్ బ్యాగులో డాక్యుమెంట్లు తేవడం ఇబ్బందిగా ఉండడం వల్ల.. అందుకోసం ఒక ఎర్రటి బ్రీఫ్ కేసు కొన్నారు. నవంబర్ 26, 1947 తేదిన స్వాతంత్ర్య భారతానికి తొలి ఆర్థిక శాఖా మంత్రి షణ్ముఖం శెట్టి తొలిసారిగా బడ్జెట్ ప్రసంగానికి వస్తూ.. తాను కూడా పత్రాలను బ్రీఫ్ కేసులోనే తీసుకొచ్చారు.
అప్పటి నుండీ ఆ సంప్రదాయం అలాగే కొనసాగుతోంది. 1998-99 బడ్జెట్ సమయంలో ఫైనాన్స్ మినిస్టర్ యశ్వంత్ సిన్హా నలుపు రంగు లెదర్ బ్యాగ్లో పత్రాలు తీసుకొచ్చారు. 2010లో ప్రణబ్ ముఖర్జీ అదే కొత్త పెట్టెలో బడ్జెట్ పత్రాలు తీసుకొచ్చారు. అయితే ఆ పెట్టెను వాడకుండా.. బీజేపీ అధికారంలోకి వచ్చాక మరో కొత్త పెట్టె కొన్నారు. అలా కొత్త పెట్టెల సంప్రదాయం మొదలైంది. ప్రస్తుతం అరుణ్ జైట్లీ తీసుకొచ్చేది కూడా కొత్త పెట్టె అనే అంటున్నారు.