మోదీజీ.. మీరు చేసిన పనికి సర్దార్ పటేల్ ఏడుస్తారు: గిరిజనుల బహిరంగ లేఖ

భారత ప్రధాని నరేంద్ర మోదీకి గుజరాత్‌లోని సర్దార్ సరోవర్ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో 22 గిరిజన గ్రామాల నుండి వ్యతిరేకత మొదలైంది.

Last Updated : Oct 30, 2018, 03:19 PM IST
మోదీజీ.. మీరు చేసిన పనికి సర్దార్ పటేల్ ఏడుస్తారు: గిరిజనుల బహిరంగ లేఖ

భారత ప్రధాని నరేంద్ర మోదీకి గుజరాత్‌లోని సర్దార్ సరోవర్ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో 22 గిరిజన గ్రామాల నుండి వ్యతిరేకత మొదలైంది. ఈ నెల 31వ తేదిన మోదీ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా పేరుగాంచిన  సర్దార్ పటేల్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. అయితే ఆ కార్యక్రమాన్ని తాము బహిష్కరిస్తున్నట్లు గిరిజన గ్రామాల ప్రజలు తెలిపారు. వారి ప్రతినిధుల చేత ఓ బహిరంగ లేఖను మోదీకి రాయించారు. ఆ లేఖలో పలు అంశాలను పేర్కొన్నారు.

"అడవులకు, నదీజలాలకు, వ్యవసాయానికి ముప్పు వాటిల్లే విధంగా మీరు ఈ నిర్ణయాన్ని తీసుకున్నందుకు.. సర్దార్ పటేల్ బతికున్నట్లయితే కచ్చితంగా కన్నీళ్లు పెట్టుకునేవారు. మమ్మల్ని అనేక సంవత్సరాలుగా ఈ భూమి గుండెల్లో పెట్టుకొని కాపాడుతోంది. ఇలాంటి ప్రదేశాన్ని నాశనం చేయడమే కాకుండా.. ఇక్కడ ఉత్సవాలు కూడా చేయడానికి మీరు పూనుకున్నారు. మా శవాలపై పండగలు చేసుకోవడానికి మీరు ప్రయత్నిస్తున్నారని మాకు తోస్తుంది" అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ ఉత్తరంపై 22 గ్రామాలకు చెందిన పెద్దలూ సంతకాలు చేశారు. 

"మేము ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నాం. మీరు కూడా మా గ్రామ చుట్టుపక్కల ప్రాంతాలకు అతిథిగా కూడా రావద్దు. మాకు ఇక్కడ తాగునీరు, పాఠశాలలు, ఆసుపత్రుల వంటి సదుపాయాలు ఏమీ లేవు. అయినా మీరు మా గురించి పట్టించుకోకుండా విగ్రహావిష్కరణలు, ఉత్సవాలు చేసుకుంటున్నారు. మేము ప్రశ్నించాలని అనుకుంటూ ఉంటే.. పోలీసులు అడ్డు తగులుతున్నారు. మీరెందుకు మా బాధను అర్థం చేసుకోలేకపోతున్నారు..? మేము కచ్చితంగా మీ కార్యక్రమం అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాం" అని గిరిజన నాయకుడు ఆనంద్ మాజ్గావోకర్ తెలిపారు. 

Trending News