కోల్‌కతా: బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికి మరో షాక్ తగిలింది. కూటమి నుంచి వైదొలుగుతున్నట్టు భాగస్వామ్య పార్టీ అయిన గూర్ఖా జన్‌ముక్తి మోర్చా (జీజేఎం) శనివారం ప్రకటించింది. గూర్ఖాలు బీజేపీపై పెట్టుకున్న నమ్మకాన్ని ఆ పార్టీ వమ్ము చేసిందని, ఇంకెంతమాత్రం బీజేపీతో దోస్తీ కొనసాగించేది లేదని జీజేఎం ఆర్గనైజింగ్ చీఫ్ ఎల్ఎల్ లామా స్పష్టం చేశారు. కాగా ఇటీవలి కాలంలో జీజేఎంతో తాము ఎన్నికల పొత్తు మాత్రమే పెట్టుకున్నట్టు బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ చేసిన ప్రకటన జీజేఎంలో ప్రకంపనలు సృష్టించింది. దీంతో ఎన్డీయే కూటమికి ఉద్వాసన చెబుతున్నట్టు జీజేఎం ప్రకటించింది.
'గూర్ఖాల కలే మోదీ కలంటూ బీజేపీ చెప్పింది. దిలీప్ ఘోష్ ప్రకటనతో బీజేపీ మాటలన్నీ వట్టిమాటలే అని అర్ధమైంది. ఉమ్మడి రాజకీయ తీర్మానం ఏమీ లేదని, ఎన్నికల ముందు పొత్తు మాత్రమే మా మధ్య ఉందని ఘోష్ చెప్పారు. దీంతో గూర్ఖాల డిమాండ్‌పై బీజేపీకి సానుభూతి కానీ, సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి కానీ లేదని తేలిపోయింది' అని లామా మండిపడ్డారు. బీజేపీ కోసం గూర్ఖా జన్‌ముక్తి మోర్చా ఎన్నో త్యాగాలు చేసిందని అన్నారు. 2009లో కూడా డార్జిలింగ్ నియోజకవర్గం నుంచి బీజేపీ నేత జస్వంత్ సింగ్ పోటీ చేసినప్పుడు జీజేఎం మద్దతు ఇచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు.
బీజేపీకి డార్జిలింగ్ 'పొలిటికల్ గేట్ వే 'అని, జీజేఎం వల్లే అది సాధ్యమైందని చెప్పారు. ఏళ్ల తరబడి తమ సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలు ఆశతో ఎదురుచూసినా ఫలితం దక్కలేదని, బీజేపీ పార్టీ ప్రజలను మరోసారి వంచించిందని దుయ్యబట్టారు.
ఎన్డీయే కూటమికి మరో పార్టీ గుడ్‌బై