ప్రధాని అభ్యర్ధిత్వం విషయంలో ఇప్పటి వరకు కూటమి నిర్ణయిస్తుందని చెప్పుకుంటూ వచ్చిన అఖిలేష్ ..ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి ఎస్పీ బీఎస్పీ కూటమి నుంచి ప్రధాని అభ్యర్ధి వస్తారని ప్రకటించారు. కాన్నూర్ ఎన్నికల ప్రచార ర్యాలీలో అఖిలేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ పాలనలో ప్రజలు అనేక కష్టాలు అనుభవించారని... కొత్త వ్యక్తి వస్తేనే దేశాన్ని ముందుకు వెళ్లగల్గుతుందన్నారు.
కాంగ్రెస్ మోసపూరిత పార్టీ....
ఈ సందర్భంగా ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీపై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ మోసపూరిత పార్టీ అంటూ ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ తో దోస్తీని నమ్మలేమన్నారు. ఈ సందర్భగంగా గత అసెంబ్లీ ఎన్నికల పొత్తును ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ తమకు మోసం చేసిందని విమర్శించారు. ఆ పార్టీకి దురహంకారం చాలా ఎక్కువని, పొత్తులకు విలువ ఇవ్వదని దుయ్యబట్టారు. తమ పార్టీని ఎవరైనా మోసం చేశారంటే.. అది కాంగ్రెస్సేనని ఆరోపించారు.
అంచనాలు తలకిందలు...
ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి ఎస్పీ, బీఎస్పీలు కూటమిగా ఏర్పడి పోటీ చేస్తారని అందరూ భావించారు. అందరి అంచనాలను తలకిందలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టిన అఖిలేష్ యాదవ్ బీఎస్పీ, ఆర్ ఎల్ డీ లతో మాత్రమే పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగారు. తాజాగా ప్రధాని అభ్యర్ధిపై అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను ప్రాధాన్యత సంతరించుకుంది.