న్యూఢిల్లీ: భారతీయ రైల్వే సరికొత్త ఆలోచనతో రామాయణ ఎక్స్ప్రెస్ పేరుతో మరో కొత్త రైలును ప్రవేశపెట్టబోతోంది. ఇందులో ప్రయాణించేవారికి రామాయణ కాలం గుర్తొచ్చే విధంగా భక్తి పారవశ్యంతో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రైలు బోగీల లోపల రామాయణ కావ్యానికి ప్రతీక అనే విధంగా అలంకరణ ఉంటుందని, భజనలు వినిపిస్తాయని సీనియర్ రైల్వే అధికారి ఒకరు చెప్పారు. ఈ రైల్లో యాత్రికులు రామాలయంలో ఉన్న అనుభూతి పొందుతారని, ఒక విధంగా దీన్ని ‘నడిచే ఆలయం’ అనవచ్చని పేర్కొన్నారు. ఈ రైలు వచ్చే మార్చి 10 తర్వాత పట్టాలమీదికి వస్తుందని రైల్వేబోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ తెలిపారు.
ఈ రైలుకు సంబంధించిన సంవత్సర కాలమానాన్ని వచ్చేవారం విడుదల చేస్తామన్నారు. దేశంలో ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ దిక్కుల్లో వివిధ ప్రాంతాల నుంచి ఈ రైలు బయలుదేరుతుందని, అందువల్ల దేశవ్యాప్తంగా అన్నీ ప్రాంతాల ప్రజలు ఈ రైలు సౌకర్యాల్ని వినియోగించుకోగలుగుతారని తెలిపారు. రైలు బయట, లోపల రామాయణాన్ని ప్రతిబింబించే దృశ్యాలుంటాయని వీకే యాదవ్ మీడియాకు వివరించారు.
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..