షీబాక్స్.. ఇది మహిళా ఉద్యోగుల భద్రతకు, రక్షణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పథకం. ఈ పథకం ద్వారా మహిళా ఉద్యోగులు తమపై అధికారులు లేదా సహ ఉద్యోగులు ఏవైనా లైంగిక వేధింపులకు పాల్పడితే కేంద్ర మహిళా, శిశు సంరక్షణ మంత్రిత్వ శాఖకు డైరెక్ట్‌గా ఆన్లైన్ ఫిర్యాదు చేయవచ్చు. అయితే మొన్నటి వరకు కేవలం ప్రభుత్వ ఉద్యోగినులకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉండగా.. నేడు ఆ వెసులుబాటును ప్రైవేటు కంపెనీల ఉద్యోగినులకు కూడా కల్పించింది భారత ప్రభుత్వం.
షీబాక్స్ పద్ధతి ద్వారా ఉద్యోగినులు ఫైల్ చేసే ఫిర్యాదులు ఈమెయిల్స్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి చేరతాయి. అలా ప్రభుత్వానికి చేరిన ఫిర్యాదులపై ఎంక్వయరీ వేసి.. బాధితులకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తుంది శాఖ. అయితే ఈ పోర్టల్‌ను తప్పుడు ఫిర్యాదులు చేయడానికి ఉపయోగించవద్దని.. అలా ఫిర్యాదు చేసిన వారిపై శాఖ తరఫున చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కూడా ఈ పోర్టల్‌లో పేర్కొన్నారు.
ప్రస్తుతం 30.87 లక్షల మంది మహిళా ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. వారిలో 10 శాతం మంది మహిళా కార్మికులు ఉన్నారు. నిన్నటి వరకు వారికి మాత్రమే వర్తించిన ఈ పథకం.. నేటి నుండి ప్రైవేటు ఉద్యోగినులకు కూడా లభించడం గమనార్హం. ఫిర్యాదును షీబాక్స్ అడ్మినిస్ట్రేటర్లు స్వీకరించాక.. బాధితురాలితో మాట్లాడి తగు సమాచారం సేకరిస్తారు.
ఆ సమాచారాన్ని బట్టి వేధింపులకు పాల్పడే వ్యక్తిని కొద్ది రోజులు గమనిస్తారు. ఆ తర్వాత పోలీసుల సహకారంతో తగు చర్యలు తీసుకుంటారు. ఇటీవలే ఈ షీబాక్స్ పథకం గురించి పూర్తి వివరాలను కేంద్ర మంత్రి మేనకా గాంధీ తెలిపారు.