న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఈ) 12వ తరగతి ఆర్థిక శాస్త్రం పరీక్షను మళ్లీ నిర్వహించాలని నిర్ణయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ఐదు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పరీక్షను మరొకసారి నిర్వహించాలనే నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేయలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఎ బాబ్డే, ఎల్ నాగేశ్వరరావులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. మార్చి 26, మార్చి 28న జరిగిన 12వ తరగతి ఆర్ధిక శాస్త్రం, 10వ తరగతి గణితం ప్రశ్నాపత్రాలు వాట్సాప్లో లీక్ అయిన సంగతి తెలిసిందే..!
రీ-ఎగ్జామ్కు సంబంధించిన నిర్ణయం సిబిఎస్ఈ యొక్క ప్రత్యేక అధికారం అని, న్యాయవ్యవస్థ ఈ విషయంలో జోక్యం చేసుకోదని సుప్రీంకోర్టు తెలిపింది.
లక్షల మంది విద్యార్థుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని 10వ తరగతి గణిత పరీక్ష దేశ వ్యాప్తంగా మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని సిబిఎస్ఈ తెలిపింది. ప్రశ్నాపత్రం లీకేజ్ ప్రభావం పరీక్షపై పడిందా?లేదా? అనే అంశంపై విచారణ చేసిన అనంతరం సిబిఎస్ఈ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే 12వ తరగతి ఆర్థిక శాస్త్రం పరీక్ష ఏప్రిల్ 25న మళ్లీ నిర్వహించనున్నట్లు పేర్కొంది. కేవలం ఢిల్లీ, హర్యానాలో మాత్రమే పేపర్ లీక్ జరిగింది కాబట్టి అక్కడ మాత్రమే పరీక్ష నిర్వహిస్తామని పేర్కొంది.