15 లక్షల హామీ.. ఆర్టీఐ పరిధిలోకి రాదు: పీఎంవో

15 లక్షల హామీ..ఆర్టీఐ పరిధిలోకి రాదని పీఎంవో స్పష్టం చేసింది.

Last Updated : Apr 24, 2018, 01:08 PM IST
15 లక్షల హామీ.. ఆర్టీఐ పరిధిలోకి రాదు: పీఎంవో

దేశంలోని ప్రతి ఒక్కరి అకౌంట్‌లో 15 లక్షల రూపాయిలు జమ చేస్తామని గత 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి రాదని ప్రధాని కార్యాలయం (పిఎంఒ) తేల్చి చెప్పింది. కనుక ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉత్పన్నం కాదని కేంద్ర సమాచార కమిషన్‌కు పిఎంఒ పేర్కొంది. మోహన్‌ కుమార్‌ శర్మ అనే ఆర్టీఐ కార్యకర్త 2016 నవంబర్‌లో ఈ అంశంపై ఆర్టీఐలో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఆర్టీఐ కార్యకర్త పీఎంవో కార్యాలయానికి.. ఆర్బీఐకు ఆర్టీఐ కింద లేఖలు రాశారు. ‘రూ.15 లక్షలు జమ చేయిస్తానని మోదీ చెప్పారు. అది ఎంత వరకు వచ్చింది?' అని ఆయన లేఖలో వివరణ కోరారు. అయితే ఆ వివరణకు ఇప్పుడు మోక్షం లభించింది. దానిపై పీఎంవో కార్యాలయం స్పందిస్తూ..ఆర్టీఐ చట్టం సెక్షన్‌-2(ఎఫ్‌) ప్రకారం ఇది సమాచారం కిందే రాదంటూ సమాచార కమిషనర్‌కు బదులిచ్చారు. ఇక నోట్ల రద్దు నిర్ణయం కొన్ని ప్రింట్‌ మీడియాలకు ముందే ఎలా తెలిసిందంటూ మరో లేఖకు కూడా సమాచారం కింద రాదంటూ పీఎంవో ఆఫీస్‌ పేర్కొంది.

సమాచార హక్కు చట్టం-2015 లోని సెక్షన్‌-2(ఎఫ్‌) ప్రకారం.. రికార్డులు, పత్రాలు, మెమోలు, ఈ మెయిళ్లు, అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, సర్క్యులర్లు, ఉత్తర ప్రత్యుత్తరాలు, లాగ్ పుస్తకాలు, ఒప్పందాలు, నివేదికలు, నమూనాలు, తనిఖీ రికార్డులు సమాచారం కిందకు వర్తిస్థాయి. ఈ సమాచారం ఎలక్ట్రానిక్ రూపంలోనైనా ఉండొచ్చు.

2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా, దేశంలో, విదేశాల్లో నల్లధనాన్ని వెలికితీసి ప్రతి భారతీయుడి ఖాతాలో రూ. 15 లక్షలు జమచేస్తామని మోదీ అన్నారు.

 

Trending News