కన్నతండ్రినే జైల్లో పెట్టిన ఔరంగజేబులా మా పార్టీ వ్యవహరిస్తోంది: బీజేపీ సీనియర్ నేత

    

Last Updated : Nov 10, 2018, 02:10 PM IST
కన్నతండ్రినే జైల్లో పెట్టిన ఔరంగజేబులా మా పార్టీ వ్యవహరిస్తోంది: బీజేపీ సీనియర్ నేత

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీట్ల కేటాయింపు విషయంలో వివాదం తలెత్తడంతో.. స్వయానా సొంత పార్టీనే ఓ బీజేపీ నేత దుమ్మెత్తి పోశారు. బీజేపీ పార్టీ తరఫున గెలిచి గతంలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన రామకృష్ణ  కుస్మరియా మాట్లాడుతూ.. కన్నతండ్రినే జైల్లో పెట్టిన ఔరంగజేబులా తమ పార్టీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ మధ్యకాలంలో సీనియర్ నేతలను బీజేపీ పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రస్తుతం బుందేల్‌ఖండ్ అభివృద్ధి  కార్పొరేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న రామకృష్ణ 1977 నుండి ఎంపీగా, ఎమ్మెల్యేగా కూడా పలుమార్లు గెలిచారు. అలాగే మంత్రిగా కూడా సేవలందించారు.

ప్రజలు తనను ఎన్నుకొనేందుకు సిద్ధంగా ఉన్నా.. టిక్కెట్ కేటాయింపు విషయంలో పార్టీ తనను పక్కన ఎందుకు పెడుతుందో అర్థంకావడం లేదని ఈ సందర్భంగా ఆయన మీడియాకి తెలిపారు. బీజేపీ తనను తిరస్కరించడం వల్లే దామో నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు వేశానని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. గతంలో  ఇదే నియోజకవర్గం నుండి ఆయన అయిదు సార్లు ఎంపీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినట్లు పేర్కొన్నారు. 

ఈ నెల 28వ తేదిన మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఇప్పటికే పరిస్థితి వేడెక్కింది. మధ్యప్రదేశ్‌ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ తమ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. ఆ పార్టీ సీనియర్ నేతలు జ్యోతిరాదిత్య  సింధియా, కమల్‌నాథ్‌, దిగ్విజయ్‌ సింగ్‌ మొదలైన వారు మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు.

Trending News