తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులకే కాదు.. ఆయన నుంచి పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన ప్రకటన కోసం ఎదురుచూస్తోన్న వాళ్లందరికీ ఒకేసారి షాకిచ్చాడు. ఎవ్వరూ ఊహించని విధంగా ఓ ప్రకటన చేసి అందరి మైండ్స్ బ్లాంక్ చేశాడు. ఇంతకీ రజినీకాంత్ చేసిన ప్రకటన ఏంటనుకుంటున్నారు ? తాను ఏర్పాటు చేయబోయే పార్టీ గురించో, లేక తన రాజకీయ విధివిధానాల గురించో కాదు... 'కాలా' తర్వాత తాను హీరోగా చేయనున్న మరో కొత్త సినిమా గురించి. అవును నిజమే.. ప్రస్తుతం తమిళనాట రాజకీయాలు రంజుగాసాగుతున్న తరుణం కావడంతోపాటు తోటి నటుడు కమల్ హాసన్ ఆల్రెడీ రాజకీయం ప్రారంభించేశారు. మక్కల్ నీధి మయ్యం అని పార్టీ పేరు ప్రకటించి జండాను కూడా పాతేశాడు. కమల్ హాసన్ పార్టీ తర్వాత మళ్లీ అంతకన్నా ఆసక్తికరమైన ప్రకటన ఏదైనా వుందా అంటే అది రజినీకాంత్ చేయబోయే రాజకీయ పార్టీ ప్రకటనే అని అనుకున్నారంతా.
ఇదిలావుంటే, తళైవా మాత్రం అందరి అంచనాలకు భిన్నంగా తమిళనాట తన పొలిటికల్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తోన్న అభిమానులకు షాక్ ఇస్తూ తన కొత్త సినిమా ప్రకటన చేశాడు. 'పిజ్జా', 'జిగర్తాండ', 'ఇరైవి' లాంటి చిత్రాలతో మంచి డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తన తదుపరి సినిమా వుంటుందని స్పష్టంచేశాడు రజినీ. సన్ పిక్చర్స్ పై కళానిధి మారన్ నిర్మించనున్న ఈ సినిమా ప్రకటన రజినీని హీరోగా చూడాలనుకునే వారికి ఓ గుడ్ న్యూస్ అయినప్పటికీ... ఆయనను తమ తర్వాతి ముఖ్యమంత్రిగా చూడాలనుకునే వారికి మాత్రం కొంత నిరుత్సాపరిచిందనే టాక్ వినిపిస్తోంది.