Rajasthan political crisis: న్యూఢిల్లీ: రాజస్థాన్ కాంగ్రెస్ (Congress) లో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. సీఎం అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot), డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ (Sachin Pilot) మధ్య వైరం తారస్థాయికి చేరడంతో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడే పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింథియా తిరుబాటు మరువకముందే ఇప్పుడు రాజస్థాన్‌లో మరో సీనియర్ నేత పైలట్ కూడా అదే బాటలో ఉండటంతో ఇప్పుడు కాంగ్రెస్ హై కమాండ్ తల పట్టుకుంటోంది. సచిన్ పైలట్‌ను ఎలాగైనా నచ్చజెప్పేందుకు కాంగ్రెస్ కీలక నేతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. Also read: Hardik Patel: హార్దిక్ పటేల్‌కు కీలక బాధ్యతలు
అయితే రాజస్థాన్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై రాష్ట్ర పోలీసు శాఖకు చెందిన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) రాజస్థాన్ పీసీసీ చీఫ్, డిప్యూటీ ముఖ్యమంత్రి సచిన్ పైలట్‌తోపాటు ఆయన అనుచరుడు మంత్రి రమేష్ మీనాకు నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా మరో 13మంది స్వతంత్ర ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. వీరంతా ప్రస్తుతం కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నారు. ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పైలట్‌కు నోటీసులు ఇవ్వడంపై ఆయన అనుచరులు కోపంతో రగులుతున్నారు. ఆయనకు 19మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం పైలట్ తన అనుచర ఎమ్మెల్యేలతో ఢిల్లీలో ఉన్నారు. పార్టీని వీడకుండా ఉండేందుకు కాంగ్రెస్ అధిష్టానంతో వారితో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో సాయంత్రం నాటికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) తో సచిన్ పైలట్ తన అనుచర ఎమ్మెల్యేలతో కలిసి భేటి కానున్నట్లు తెలుస్తోంది. Also read: ఐశ్వర్యరాయ్‌కి కరోనా పాజిటివ్, జయా బచ్చన్‌కు నెగటివ్
ఇదిలాఉంటే.. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ శనివారం మాట్లాడుతూ.. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు భారీ మొత్తంలో నగదు ఇస్తామంటూ ఆశ చూపుతున్నారని పేర్కొన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా బీజేపీ రాజకీయాలు చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ క్రమంలో సచిన్ పైలట్ బీజేపీ నాయకులతో సంప్రదింపులు జరిపారంటూ ఆరోపణలు వెల్లువెత్తడంతో నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా ఇద్దరు బీజేపీ నేతలను కూడా ఎస్ఓజీ అరెస్టు చేసింది. Also read: COVID19 లక్షణాలు తక్కువున్నా అమితాబ్ ఆస్పత్రిలో ఎందుకు చేరారంటే!
అయితే రాజస్థాన్ ప్రభుత్వంలో నెలకొన్న సంక్షోభంపై రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సతీశ్ పూనియా మాట్లాడుతూ.. అశోక్ గెహ్లాట్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీని నిందిస్తున్నారన్నారు. ఆ పార్టీ అంతర్గత వ్యవహారాలను బీజేపీకి అనుసంధానించడం సరికాదన్నారు. దీనిపై కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ మాట్లాడుతూ.. గెహ్లాట్, పైలట్ వల్ల అధికారం రెండుగా విడిపోయిందని, దీంతో రాష్ట్రంలో ఎలాంటి పనులు జరగడం లేదని పేర్కొన్నారు. Also read: Chinese Apps: భారత్‌లో టిక్‌టాక్ భవితవ్యం తేలేది ఎప్పుడంటే!