ఏ సమస్య వచ్చినా 182కి కాల్ చేయండి

రైలులో ప్రయాణీకులకు ఏ సమస్య వచ్చినా, ఎటువంటి ఇబ్బంది తలెత్తినా వెంటనే 182 అనే ప్రత్యేక టోల్‌ఫ్రీ నెంబరుకి కాల్ చేసి రక్షణ పొందవచ్చని అధికారులు తెలిపారు.

Last Updated : May 12, 2018, 04:35 PM IST
ఏ సమస్య వచ్చినా 182కి కాల్ చేయండి

రైలులో ప్రయాణీకులకు ఏ సమస్య వచ్చినా, ఎటువంటి ఇబ్బంది తలెత్తినా వెంటనే 182 అనే  ప్రత్యేక టోల్‌ఫ్రీ నెంబరుకి కాల్ చేసి రక్షణ పొందవచ్చని అధికారులు తెలిపారు. రైలు పేరు, బోగి, బెర్త్ నెంబర్ చెప్తే వెంటనే రైల్వే పోలీసులు (ఆర్పీఎఫ్) వస్తారని.. ఇది దేశవ్యాప్తంగా పనిచేసే నంబర్ అని తెలిపారు. ఇటీవల రైలులో దొంగతనాలు, మహిళలపై వేధింపులు వంటి ఇబ్బందులు ఎక్కువ అవుతుండటంతో రైల్వే అధికారులు తాజాగా ఈ ప్రకటన విడుదల చేశారు.  

ఇది ఎలా పనిచేస్తుందంటే..

182 నెంబరుని రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్పీఎఫ్‌)కు అనుసంధానం చేశారు. ఏ రైలు నుంచి ఈ నెంబరుకు ఫోన్‌ వస్తుందో ఆ రైలు వెళ్తున్న మార్గంలోని రైల్వే డివిజన్‌ కార్యాలయానికి ఈ కాల్‌ వెళ్తుంది. అక్కడి నుంచి సంబంధిత స్టేషన్‌ (రైలు నెక్స్ట్ స్టాప్ లో ఉండే స్టేషన్) కు సమాచారం అందిస్తారు. ఫోన్‌కాల్‌లో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా అక్కడకు చేరుకుని సంబంధిత బోగీలోకి వెళ్లి ఫోన్‌చేసిన వారిని కలిసి సమస్యను పరిష్కరిస్తారు.

ఈ అంశాలపై ఫిర్యాదు చేయొచ్చు:  
 

  • బోగీలో వ్యక్తి లేదా వ్యక్తుల ప్రవర్తన, అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించిన సందర్భంలో కాల్‌ చేయవచ్చు.
  • రైలు ప్రయాణంలో మనం రిజర్వేషన్‌ చేయించుకున్న సీటు, బెర్త్‌లో వేరొకరు కూర్చుని ఎంతచెప్పినా విన్పించుకోని సందర్భంలో కాల్‌ చేయవచ్చు.
  • హిజ్రాలు, పోకిరీలు ఇబ్బందులు కలిగించినపుడు, టీటీఈ పేరిట నకిలీలు తిరుగుతున్నట్లు గుర్తిస్తే కాల్‌ చేయవచ్చు.
  • కొందరు బృందంగా ప్రయాణిస్తూ పేకాట ఆడటం, వెంట తెచ్చుకున్న మద్యం తాగుతూ తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్న క్రమంలో కాల్‌ చేయవచ్చు.
  • ప్రయాణికులు తమ బ్యాగులను మర్చిపోయినపుడు, దొంగతనాలు జరుగుతున్నపుడు, విలువైన వస్తువులు పోయిన సందర్భాలలో 182 నెంబరుకు కాల్‌ చేయవచ్చు.
  • రైలు ప్రయాణంలో ఎవరికైనా అకస్మాత్తుగా అనారోగ్య సమస్య తలెత్తినపుడు, వైద్యసాయం అవసరమైనపుడు కాల్‌ చేయవచ్చు.
  • రైలులోని మరుగుదొడ్లలో నీరు సరఫరా కానపుడు, బోగీలో దీపాలు వెలుగనపుడు, ఫ్యాన్లు తిరగని సమయంలో కాల్‌ చేయవచ్చు.

 

 

Trending News