ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ యువతి మరో ముస్లిం యువకుడితో స్నేహం చేసిందనే కారణంగా ఆమెను పోలీసులు జీపులో తిప్పుతూ వేధించిన ఘటన మరవక ముందే తాజాగా మరోచోట పోలీసులు మరో అరాచకానికి పాల్పడిన వైనం వెలుగుచూసింది. ఓ నడి వయస్సున్న మహిళను తమ జీపుపైనే కట్టేసిన పోలీసులు.. ఆమెను ఊరంతా ఊరేగిస్తూ తిప్పిన ఘటన పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలో చోటుచేసుకుంది. పంజాబ్ మీడియా కథనాల ప్రకారం.. ఈ ఘటనలో జీపుపై నుంచి జారి కిందపడిన మహిళ తలకు గాయాలు కావడంతో స్థానికులే బాధితురాలిని ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే..
ఓ స్థల వివాదం కేసులో మహిళ మామను ప్రశ్నించేందుకు పోలీసులు అమృత్‌సర్‌లోని చొవిందా దేవి ప్రాంతంలో ఉంటున్న ఆ మహిళ ఇంటికి వెళ్లారు. అయితే, ఆ సమయంలో అతడు ఇంట్లో లేకపోవడంతో అక్కడే ఉన్న ఆమె భర్తను పోలీసు స్టేషన్‌కి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు ఎదురుతిరిగిన ఆ మహిళ.. తన భర్తను తీసుకెళ్లడానికి వీల్లేదంటూ అడ్డుకుంది. మహిళ తీరుకు ఆగ్రహించిన పోలీసులు.. పోలీసులకే ఎదురు తిరుగుతావా అంటూ ఆమెనే అదుపులోకి తీసుకుని ఇలా జీపుపై కట్టేసి ఊరేగించినట్టు సమాచారం.