నిరవ్ మోడీ సోదరికి ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు

పూర్వి దీపక్ మోడీకి ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు

Last Updated : Sep 10, 2018, 08:24 PM IST
నిరవ్ మోడీ సోదరికి ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన నిరవ్ మోదీ సోదరి పూర్వి మోడీకి ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీచేసింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం.. ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడాన్ని అరెస్ట్ వారెంట్‌తో సమానంగా భావించవచ్చు. ఒకసారి ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఇంటర్‌పోల్ నుంచి రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయంటే, ఇంటర్‌పోల్‌లో సభ్యత్వం కలిగి ఉన్న 192 దేశాల్లో ఆ వ్యక్తి ఎప్పుడు, ఎక్కడ కనపడినా వెంటనే అరెస్ట్ చేయమని అర్థం. అరెస్ట్ అయిన అనంతరం ఆ వ్యక్తి ఎవరికి అవసరమో.. వారికి అప్పగించే బాధ్యతను కూడా ఇంటర్‌పోల్ విభాగమే తీసుకుంటుంది. రూ.13,000 కోట్ల కుంభకోణంలో నిందితుడిగా ఉండి దేశం విడిచిపారిపోయిన నిరవ్ మోడీకి సోదరి అయిన పూర్వి దీపక్ మోడీ (44) బెల్జియన్ దేశ పౌరురాలు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేసిన విజ్ఞప్తి మేరకు ఇంటర్ పోల్ విభాగం పూర్వి మోడీకి ఈ నోటీసులు జారీచేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేసులో తమ ఎదుట హాజరు కావాల్సిందిగా పూర్వి మోడీకి జారీ చేసిన నోటీసుల్లో ఇంటర్‌పోల్ పేర్కొన్నట్టు తెలుస్తోంది.

గత మార్చి నెలలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ కేసుకు సంబంధించిన చార్జీషీట్‌లో పూర్వి మోడీ పేరును చేర్చింది. బెల్జియం దేశస్తురాలైన పూర్వి మోడీ ఇంగ్లీష్, గుజరాతి, హిందీ భాషల్లో మాట్లాడగలరని ఇంటర్ పోల్ నోటీసులు స్పష్టంచేస్తున్నాయి.

Trending News