భారత ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశంలో దీవుల పరిరక్షణ కార్యక్రమాలను పర్యవేక్షించే ఐలాండ్ డెవలప్ మెంట్ ఏజెన్సీ పనితీరును ఈ రోజు సమీక్షించారు. ఈ క్రమంలో అండమాన్ నికోబార్ లాంటి దీవుల్లో పర్యాటక అభివృద్ది గురించి మాట్లాడారు. దీవుల్లో సౌరశక్తి వినియోగాన్ని పెంచాలని సూచించారు.
అలాగే లక్షద్వీప్ దీవికి సంబంధించి అక్కడి బ్రాండ్ చేపలుగా పేరుగాంచిన టూనా జలచరాల గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. వాటి ప్రమోషన్ కోసం ఏజెన్సీ ఏం చేయాలన్న విషయంపై కూడా చర్చించారు. ముఖ్యంగా లక్షద్వీప్ ద్వీపం పరిశుభ్రత విషయంలో ముందంజ వేయడం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. అండమాన్తో పాటు లక్షద్వీప్ ద్వీప ప్రాంతాల్లో జనావళి సంక్షేమానికి.. ఇతర మౌళిక వసతుల కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై అధికారులతో ప్రధాని మోదీ చర్చించారు.
ఈ సమీక్ష కార్యక్రమంలో ఐలాండ్ డెవలప్ మెంట్ ఏజెన్సీ అధికారులతో పాటు హోం మంత్రి రాజనాథ్ సింగ్, నీతి ఆయోగ్ సీఈఓ, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ దీవుల గవర్నర్లు మరియు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. భారతదేశపు దీవుల పరిరక్షణ కోసం జూన్ 1, 2017 తేదిన ఐలాండ్ డెవలప్ మెంట్ ఏజెన్సీని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ఏజెన్సీ దేశానికి చెందిన 26 ద్వీపాల పరిరక్షణ కార్యక్రమాలకు సంబంధించి పని చేస్తుంది.