విద్యార్థుల కోసం పుస్తకం రాసిన భారత ప్రధాని..!

భారతప్రధాని నరేంద్ర మోదీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల కోసం ఓ పుస్తకం రాశారు. 

Last Updated : Feb 3, 2018, 12:32 PM IST
విద్యార్థుల కోసం పుస్తకం రాసిన భారత ప్రధాని..!

భారతప్రధాని నరేంద్ర మోదీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల కోసం ఓ పుస్తకం రాశారు. దానికి "ఎగ్జామ్స్ వారియర్స్" అని పేరు పెట్టారు. పరీక్షలంటే భయపడకూడదని.. యుద్ధానికి వెళ్లే సైనికులు ఎంత ధైర్యంగా ఉంటారో అంతే ధైర్యంగా, తెగింపుతో పరీక్షలకు పిల్లలు హాజరవ్వాలన్నది ఆ పుస్తక సారాంశం. ముఖ్యంగా పరీక్షలంటే భయాన్ని దూరం చేసుకొని.. ఉత్సుకత పెంచుకోవాలని.. పరీక్ష రోజులను పండగ రోజుల్లా సెలబ్రేట్ చేసుకోవాలని ఈ పుస్తకం చెబుతుందని ప్రధాని చెప్పారు.

శనివారం ఈ పుస్తకాన్ని ఆయన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో పాటు విడుదల చేయనున్నారు. భారతదేశ యువతలో ధైర్యాన్ని నూరిపోసేందుకు.. ఏ జఠిలమైన సమస్యనైనా ఎదుర్కొనే వీరులుగా తీర్చిదిద్దేందుకు ఈ పుస్తకాన్ని రాశానని మోదీ తెలిపారు. పెంగ్విన్ ఇండియా ప్రచురణకర్తగా వ్యవహరిస్తున్న ఈ పుస్తకం 208 పేజీల్లో లభ్యమవుతుంది.

ఈ సందర్భంగా పెంగ్విన్ ఇండియా ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇది బోధనల పుస్తకం కాదని.. ఆలోచింపజేసే ప్రాక్టికల్ పుస్తకమని తన ప్రకటనలో తెలిపింది. దీనిని విద్యార్థులు ఒక హ్యాండ్ గైడ్‌గా కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపింది. మొత్తం ఈ పుస్తకంలో 25 ఛాప్టర్లు ఉన్నాయి. బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ ఈ పుస్తకానికి టెక్నాలజీ, నాలెడ్జ్ పార్టనర్‌గా వ్యవవహరించడం గమనార్హం. 

Trending News