శనివారం మధ్యా్హ్నానికల్లా ఒక కొలిక్కి వస్తుందనుకున్న ఢిల్లీ వాయు కాలుష్య సమస్య మళ్ళీ ఊపందుకుంది. కనీస ఉష్ణోగ్రత 13 డిగ్రీలకు పడిపోవడంతో మరల ఎమర్జెన్సీ పరిధిలోకి చేరింది. పైగా, పలుచోట్ల పొగమంచు విపరీతంగా పెరగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ, నోయిడా ప్రాంతాల్లో గాలి నాణ్యత శాతం అమాంతం తగ్గిపోతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అందుకు గల నాలుగు ప్రధానమైన కారణాలను సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గుర్తించింది. ఉష్ణోగ్రత, గాలి వేగం, తేమ, వాతావరణ పొరల్లో ఎప్పటికప్పుడు వస్తున్న అనూహ్య మార్పుల వల్లే ఈ సమస్య అని పేర్కొంది. ఇప్పటికే ఢిల్లీలో పేరుకుపోతున్న పొగమంచు ప్రభావం వల్ల దాదాపు 34 రైళ్లను ఆలస్యంగా నడపడానికి రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. 21 రైళ్లకు సంబంధించిన సమయాన్ని మార్చారు. అలాగే 8 రైళ్ళను బంద్ చేశారు. ఇప్పటికే ఢిల్లీలోని వాతావరణ పరిస్థితుల వలన నగరంలో నిర్మాణాలను ఆపేయవలసిందిగా ప్రభుత్వం ప్రకటించింది. హెవీ వెహికల్స్‌ను నగరంలోకి రాకుండా ట్రాఫిక్ పోలీసులు అడ్డుకుంటున్నారు. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వం కూడా హెలికాప్టర్ల ద్వారా కృత్రిమ వర్షాన్ని కురిపించి వాతావరణాన్ని మార్చేందుకు ప్రయత్నించాలని చూస్తోంది. అందుకోసం పవన్ హన్స్ హెలికాప్టర్స్ వారితో ఇప్పటికే మాట్లాడారు. అలాగే ఆడ్ ఈవెన్ స్కీమ్ ద్వారా కార్ల రేషనైజింగ్ చేయాలని భావించిన ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది.