ఉల్లి లోడుతో వెళ్తున్న ట్రక్కును దోచుకున్న దొంగలు

ఉల్లి ధరల పెరుగుదల కారణంగా పరిస్థితి ఎక్కడివరకు వెళ్లిందో చెప్పడానికి నిదర్శనంగా చోటుచేసుకున్న మరో చోరీ ఘటన ఇది. ఇటీవల కాలంలో ఉల్లి సరుకు చోరీకి గురైన ఘటనలు తరచుగా వెలుగుచూస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా బీహార్‌లోని కైమూరు జిల్లాలోనూ అటువంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది.

Last Updated : Dec 28, 2019, 06:20 PM IST
ఉల్లి లోడుతో వెళ్తున్న ట్రక్కును దోచుకున్న దొంగలు

పాట్నా: ఉల్లి ధరల పెరుగుదల కారణంగా పరిస్థితి ఎక్కడివరకు వెళ్లిందో చెప్పడానికి నిదర్శనంగా చోటుచేసుకున్న మరో చోరీ ఘటన ఇది. ఇటీవల కాలంలో ఉల్లి సరుకు చోరీకి గురైన ఘటనలు తరచుగా వెలుగుచూస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా బీహార్‌లోని కైమూరు జిల్లాలోనూ అటువంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. 51 క్వింటాళ్ల ఉల్లి లోడుతో వెళ్తున్న ట్రక్కును మార్గం మధ్యలోనే అడ్డగించిన దొంగలు.. ట్రక్కు డ్రైవర్‌ను బంధించి అందులోని ఉల్లిని దోచుకున్నారు. చోరీ అనంతరం మరో ఐదు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి తనను విడిచిపెట్టారని డ్రైవర్ దేశ్ రాజ్ తెలిపాడు. ఉత్తర్ ప్రదేశ్‌లోని అలహాబాద్ నుంచి బీహార్‌లోని జహనాబాద్‌కు ఉల్లి సరుకును తరలించే క్రమంలో కైమూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుందని డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయుధాలు కలిగిన ఆరుగురు దుండగులు రాత్రి 10 గంటల ప్రాంతంలో తనను బంధించారని.. తిరిగి రాత్రి 2 గంటల ప్రాంతంలో తనని విడిచిపెట్టారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. డ్రైవర్ దేశ్ రాజ్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

కైమూర్ జిల్లాలో ఈ నెలలో ఉల్లి సరుకు చోరీకి గురవడం ఇది రెండోసారి. డిసెంబర్ మొదటి వారంలోనే కుద్ర పోలీసు స్టేషన్ పరిధిలో ఉల్లి ట్రక్కును దోచుకున్న దొంగలు.. అందులోంచి 19 క్వింటాళ్ల ఉల్లిని ఎత్తుకెళ్లారు.

Trending News