భగవంతుడే ఆ బిడ్డను కాపాడాడా? రైలు ప్రమాదం నుండి త్రుటిలో బయటపడిన చిన్నారిపాప..!

ఈ రోజు మధుర ప్రాంతంలోని ఓ రైల్వే స్టేషనులో అనుకోని సంఘటన జరిగింది. తల్లిదండ్రులు రైలు నుండి దిగుతున్న సందర్భంలో అనుకోకుండా వారి చేతిలోని చిన్నారి పాప జారి పట్టాల మీద పడిపోయింది. 

Last Updated : Nov 21, 2018, 07:26 PM IST
భగవంతుడే ఆ బిడ్డను కాపాడాడా? రైలు ప్రమాదం నుండి త్రుటిలో బయటపడిన చిన్నారిపాప..!

ఈ రోజు మధుర ప్రాంతంలోని ఓ రైల్వే స్టేషనులో అనుకోని సంఘటన జరిగింది. తల్లిదండ్రులు రైలు నుండి దిగుతున్న సందర్భంలో అనుకోకుండా వారి చేతిలోని చిన్నారి పాప జారి పట్టాల మీద పడిపోయింది. ఆ సమయంలో ఆ చిన్నారి తల్లిదండ్రులు సమతా ఎక్స్ ప్రెస్‌లో ప్రయాణిస్తున్నారు. అయితే చిన్నారి పట్టాల మీద పడిపోగానే.. రైలు కదిలిపోయింది. ఆ సంఘటనను చూసిన వారందరూ హతాశులయ్యారు. తల్లిదండ్రులైతే కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటన అక్కడున్న సీసీ టీవీ కెమెరాల్లో కూడా నమోదైంది.

అయితే చిత్రమైన విషయం ఏమిటంటే... ట్రాక్ మధ్య చిక్కుకుపోయిన చిన్నారి అసలు కదలకుండా అలాగే ఉండిపోవడంతో.. రైలు తన మీద నుండి వెళ్లినా ఆమెకు ఏమీ కాలేదు. రైలు వెళ్లిపోగానే.. ఏం జరిగిందో చూడాలని పట్టాల వద్దకు వచ్చిన ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. ఆ చిన్నారికి ఒక్క చిన్న గాయం కూడా కాలేదు. అంతే... ఆ చిన్నారిని మృత్యుంజయురాలిగా జనాలు కీర్తించడం మొదలు పెట్టారు. ఆ చిన్నారి తల్లిదండ్రులు కూడా దేవుళ్లకు దండాలు పెట్టుకొని భావోద్వేగానికి గురయ్యారు. 

రైలులో ప్రయాణికుల రద్దీ ఎక్కువ అవ్వడంతో.. వెనుక నుండి ఎవరో నెట్టివేయడంతో తల్లి చేతి నుండి బిడ్డ పట్టాల మీద పడిపోయిందని పలువురు అంటున్నారు. అయితే.. పాప సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వాట్సాప్ వీడియో ఆన్ లైన్‌లో హల్చల్ చేస్తోంది.ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర రైల్వేస్టేషన్‌లో మంగళవారం జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ప్రాణాలతో బయటపడిన చిన్నారి బాలికను అందరూ ఆశీర్వదిస్తూ దీవించారు. మధుర రైల్వే స్టేషన్ అధికారులు కూడా జరిగిన సంఘటనపై ఆశ్చర్యపోయారు

Trending News