జమ్ముకశ్మీర్‌‌లో అసలు ఏం జరుగుతోంది : కేంద్రానికి ఒమర్ అబ్ధుల్లా ప్రశ్న

జమ్ముకశ్మీర్‌ అంశంపై ఇకనైనా పెదవి విప్పండి: కేంద్రానికి ఒమర్ అబ్ధుల్లా డిమాండ్

Last Updated : Aug 3, 2019, 03:55 PM IST
జమ్ముకశ్మీర్‌‌లో అసలు ఏం జరుగుతోంది : కేంద్రానికి ఒమర్ అబ్ధుల్లా ప్రశ్న

జమ్ముకశ్మీర్‌‌లో నెలకొన్న అనిశ్చితిపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్ధుల్లా డిమాండ్ చేశారు. దీనిపై పార్లమెంట్‌లో కేంద్రం ఓ స్పష్టమైన ప్రకటన చేయాలని ఒమర్ అబ్దుల్లా అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు జమ్ముకశ్మీర్‌ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ని కలిసిన అనంతరం తన పార్టీ నేతల బృందంతో కలిసి మీడియాతో మాట్లాడిన ఒమర్.. జమ్మూకాశ్మీర్‌లో ఏం జరుగుతుందో అసలు ఎవరికీ అంతుచిక్కడం లేదని, సోమవారం నాడు పార్లమెంట్‌లో కేంద్రం ఓ ప్రకటన చేస్తే కానీ కశ్మీర్ వాసులకు ఓ స్పష్టత రాదని అన్నారు. 

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు తలదాచుకున్నారని, అదను చూసి దాడికి పాల్పడేందుకు పాక్ ఉగ్రవాదులు కుట్రపన్నుతున్నారని నిఘావర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి అమర్‌నాథ్ యాత్రకు వచ్చిన భక్తులు, పర్యాటకులు వెంటనే రాష్ట్రం విడిచిపోవాల్సిందిగా ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతే రాష్ట్రంలో కొంత అనిశ్చితి నెలకొందని రాజకీయ పార్టీలు చేస్తోన్న విమర్శలపై గవర్నర్ మాలిక్ స్పందించారు. నిఘావర్గాల హెచ్చరికల దృష్ట్యా తాను ఇచ్చిన ఆదేశాలను రాజకీయపార్టీలు తమకు తోచినట్టుగా ఆపాదించుకోవడం వల్లే జనం అయోమయానికి గురవుతున్నారని, అంతకుమించి కంగారు పడాల్సిన అవసరం లేదని గవర్నర్ స్పష్టంచేశారు.

Trending News