బీజేపీ నేత రామ్ మాధవ్‌కి సవాల్ విసిరిన కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్ధుల్లా

రామ్ మాధవ్‌కి సవాల్ విసిరిన ఒమర్ అబ్ధుల్లా

Last Updated : Nov 22, 2018, 06:21 PM IST
బీజేపీ నేత రామ్ మాధవ్‌కి సవాల్ విసిరిన కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్ధుల్లా

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ సత్యపాల్ మాలిక్ నిర్ణయం తీసుకోవడంతో కాశ్మీర్ లోయలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అది కూడా తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కలిసి విజ్ఞప్తి చేసిన కొన్ని గంటల అనంతరమే గవర్నర్ తీసుకున్న నిర్ణయం కావడంతో రాష్ట్రంలోని బీజేపీ ప్రత్యర్థులంతా గవర్నర్ తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జమ్మూ కశ్మీర్‌లో పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం వెనుక పాకిస్తాన్‌ హస్తం ఉందని బీజేపీ ప్రధాన కార్యదర్శి, జమ్మూకశ్మీర్ బీజేపీ ఇంచార్జ్ రామ్ మాధవ్ చేసిన ఆరోపణలపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఒమర్ అబ్ధుల్లా ఘాటుగా స్పందించారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన తమ పార్టీ నేతలను కించపరిచేలా రామ్ మాధవ్ వ్యాఖ్యానించారని, ఆయన వెంటనే తన ఆరోపణలను నిరూపించుకోవాలని ఒమర్ అబ్ధుల్లా సవాల్ విసిరారు. లేని పక్షంలో రామ్ మాధవ్ తమ పార్టీకి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఒమర్ అబ్ధుల్లా డిమాండ్ చేశారు. 

ఇదిలావుంటే, జమ్మూకాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. ఈ వివాదంపై కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత పి చిదంబరం ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. "ఐదారు నెలలపాటు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీని సస్పెన్షన్‌లో ఉంచడానికి ఇష్టపడిన గవర్నర్.. ఎవరో ఒకరు ముందుకొచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే మాత్రం ఇష్టపడటం లేదు" అని విమర్శించారు. 

Trending News