గోవాలో నాయకత్వ మార్పు ఉండబోదు: స్పష్టం చేసిన బీజేపీ

గోవా ముఖ్యమంత్రిని మార్చేది లేదు: బీజేపీ

Last Updated : Sep 17, 2018, 10:00 AM IST
గోవాలో నాయకత్వ మార్పు ఉండబోదు: స్పష్టం చేసిన బీజేపీ

ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మార్పుపై బీజేపీ అధిష్టానం స్పందించింది. గోవాలో నాయకత్వ మార్పు ఉండబోదని స్పష్టం చేసింది. మనోహర్ పారికర్ ఆరోగ్యం కుదుటపడుతోందని.. ఇక నాయకత్వ మార్పు ఉండబోదని తెలిపింది.

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా.. గోవాలో రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు బీఎల్ సంతోష్, రామ్ లాల్, వినయ్ పురానిక్‌లను పంపింది. ఈ ముగ్గురూ ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాలతో పనాజీలో చర్చించారు. అనంతరం రామ్ లాల్ మీడియాతో మాట్లాడుతూ.. 'ప్రస్తుతం గోవా ప్రభుత్వానికి వచ్చిన సమస్యలేమీ లేవు. నాయకత్వ మార్పును ఎవరూ కూడా కోరుకోవడంలేదు.' అని స్పష్టం చేశారు.

అటు అనారోగ్యంతో సీఎం పదవికి పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోతున్నందున.. సీఎం బాధ్యతల నుంచి తప్పించాలని పారికర్ చేసిన విజ్ఞప్తినీ బీజేపీ అధిష్టానం తిరస్కరించింది. మనోహర్ పారికర్‌నే ముఖ్యమంత్రిగా కొనసాగించడానికి మొగ్గు చూపింది.

ఏడు నెలలుగా క్లోమ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పారికర్ మెరుగైన చికిత్స కోసం పలుమార్లు అమెరికాకు వెళ్లిరాగా.. తాజాగా వారం రోజులపాటు అమెరికాలో చికిత్స పొంది సెప్టెంబర్ 6న భారత్‌కు తిరిగొచ్చారు. గతవారం అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో పారికర్ చేరగా.. ఇప్పుడు ఆయన ఆరోగ్యం కుదుటపడుతున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.

Trending News