మీడియాతో మోడీ ప్రత్యేక ముచ్చట్లు

   

Last Updated : Oct 28, 2017, 01:51 PM IST
మీడియాతో మోడీ ప్రత్యేక ముచ్చట్లు

భారత ప్రధాని మోడీ ఈ రోజు ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దీపావళి మంగళ్ మిలన్ సమారోహం మరియు వార్షిక అనుసంధాన కార్యక్రమంలో ప్రసంగించారు. మీడియాతో తనకున్న బంధాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నేడు మీడియావాళ్ళు ప్రధానితో మాట్లాడే సమయమే ఉండడం లేదని, ఆయన ఎప్పుడూ బిజీగా ఉంటారని ఫిర్యాదు చేస్తున్నారని..కాకపోతే గతంలో ఆ పరిస్థితి లేదని.. తానెప్పుడూ మీడియాతో అన్ని విషయాలు మాట్లాడే అవకాశం ఉండేదని అన్నారు. కానీ ఇప్పుడు కూడా పరిస్థితులు మారుతున్నాయని, మారుతున్న కాలం తనకు మీడియాతో ఉన్న బంధాన్ని మరింత పటిష్టం చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

 

 

 "నా మీడియా మిత్రులతో కలిసి స్నేహపూర్వకంగా మాట్లాడే అవకాశం దక్కినందుకు సంతోషిస్తున్నాను. కెమెరాలు, పేపర్లు, పెన్నులు లేకుండా కేవలం స్నేహపూర్వకంగా ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనడం చూడడానికి బాగుంది. మన దేశ వికాసం కోసం మనం పరస్పరం అభిప్రాయాలు పంచుకోవడం, వాటిని అర్థం చేసుకోవడం అన్నింటికన్నా ముఖ్యం" అన్నారు మోడీ. ఈ సందర్భంగా మోడీ ప్రసంగిస్తూ ప్రజలపై మీడియా ప్రభావం చాలా ఉంటుందన్నారు. గతంతో పాటు ఇప్పుడు కూడా ప్రభుత్వంపై మీడియా విమర్శలు కురిపించిన సందర్భాలు ఉన్నాయన్నారు.

అయితే స్వచ్ఛభారత్ విషయంలో ప్రభుత్వానికి మీడియా కల్పించిన ప్రచారం అపారమని.. అది మెచ్చుకోదగ్గ పరిణామమని పేర్కొన్నారు మోడీ. కేవలం అనుభవంతోటే ఎవరైనా, ఎలాంటి పాలకులు ఎజెండాతో వస్తారు, ఎలా ప్రజలకు సేవ చేస్తారు అన్న విషయాలను అర్థం చేసుకోగలుగుతారు అని మోడీ తెలిపారు. "రాజకీయాల్లో ప్రజాస్వామ్యం గురించి ప్రజలకు తెలియాలని, అలాగే రాజకీయ పార్టీలు కూడా తమ అభ్యర్థులను ఎంచుకొనేటప్పుడు పారదర్శకతను చూపించాలని" ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, స్మ్రుతి ఇరానీ తదితరులు పాల్గొన్నారు. 

Trending News