న్యూఢిల్లీ: దేశంలో అమ్ముతున్న 14 ఫెయిర్‌నెస్ క్రీముల్లో స్టెరాయిడ్స్ ఉన్నాయని గుర్తించిన కేంద్రం.. ఇక నుంచి ఫెయిర్‌నెస్ క్రీములు, ఆయింట్‌మెంట్లను విక్రయించాలంటే డాక్టర్ ప్రిస్కిప్షన్ తప్పనిసరి అని తెలిపింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ నోటిఫికేషన్ జారీ చేశారు. డాక్టర్ చీటీ లేకుండా ఈ 14 రకాల ఫెయిర్‌నెస్ క్రీములు, ఆయింట్‌మెంట్లు విక్రయించరాదని మెడికల్ షాప్‌లకు సూచించింది. డాక్టర్ చీటీలో రాసిస్తేనే వీటిని విక్రయించాలని పేర్కొంది.
ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, చర్మ సమస్యలకు మందులను కూడా మెడికల్ దుకాణాల్లోని కౌంటర్లలో ప్రిస్కిప్షన్ లేకుండా విక్రయించరాదని కేంద్రం కోరింది. ఈ మేరకు డ్రగ్స్, కాస్మెటిక్స్ రూల్స్ 1945 ప్రకారం ప్రిస్కిప్షన్ లేకుండా ఫెయిర్‌నెస్ క్రీములు, ఆయింట్‌మెంట్లను విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. స్టెరాయిడ్లతో తయారైన ఫెయిర్‌నెస్ క్రీములు, ఆయింట్‌మెంట్లను దుర్వినియోగం చేస్తున్నారని చర్మవ్యాధుల నిపుణులు చేసిన ఫిర్యాదుల మేర కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ చర్యలకు ఉపక్రమించింది. కాగా స్టెరాయిడ్స్ ఉన్న ఔషధాలు, క్రీములు, ఇతరత్రా వాడితే దీర్ఘకాలంలో ఇబ్బందులు వస్తాయి.