అటల్‌జీకి.. ఓ మధురగీతంతో లతాజీ నివాళి..!

ప్రముఖ గాయనీమణి లతా మంగేష్కర్ అటల్ బిహారీ వాజ్‌పేయికి వినూత్న రీతిలో నివాళులు అర్పించారు. 

Last Updated : Aug 17, 2018, 04:30 PM IST
అటల్‌జీకి.. ఓ మధురగీతంతో లతాజీ నివాళి..!

ప్రముఖ గాయనీమణి లతా మంగేష్కర్ అటల్ బిహారీ వాజ్‌పేయికి వినూత్న రీతిలో నివాళులు అర్పించారు. గతంలో వాజ్‌పేయి రాసిన కవితలకు బాణీలు కట్టి స్వరపర్చగా... అప్పట్లో ఆ గీతాలకు లతా మంగేష్కర్ గాత్రాన్ని అందించారు. అందులో ఒక  గీతానికి సంబంధించిన వీడియోను ఈ రోజు లతా మంగేష్కర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. గతంలో వాజ్‌పేయి రాసిన కవితలన్నీ ఓ పాటల ఆల్బమ్‌గా విడుదలయ్యాయి.

ఆ గీతాల్లో బాగా పాపులర్ అయిన 'తన్ గయి మౌత్ సే తన్ గయి' అనే గీతాన్ని ఈ రోజు లతా మంగేష్కర్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. గతంలో జగ్జీత్ సింగ్ కూడా వాజ్‌పేయి రాసిన పలు కవితలకు బాణీలు కట్టి పాడారు. ఆ పాటలన్నీ కూడా 2000లో "సంవేదన" పేరుతో ఆల్బమ్‌గా విడుదలయ్యాయి. అలాగే లతామంగేష్కర్ పాడిన వాజ్‌పేయి గీతాలన్ని కూడా "అంతర్నాద్" పేరుతో మరో ఆల్బమ్‌గా విడుదలయ్యాయి. ఆ ఆల్బమ్‌లో "గీత్ నయా గాతా హు" అనే పాట అంటే అటల్ బిహారీ వాజ్‌పేయికి ఎంతగానో ఇష్టమట.

వాజ్‌పేయి అంత్యక్రియల సందర్భంగా గానకోకిల లతా మంగేష్కర్ ఆయనతో తనకున్న అనుబంధం గురించి మీడియాతో పంచుకున్నారు. తన పేరు మీద పూణెలో ఒక ఆసుపత్రిని ప్రారంభించినప్పుడు... ముఖ్య అతిథిగా రావాల్సిందిగా వాజ్‌పేయి గారిని కోరామని.. ఆయన ఎంతో సంతోషంగా తన ఆహ్వానాన్ని మన్నించి వచ్చారని లతా మంగేష్కర్ అన్నారు.

"వాజ్‌పేయి గారు నా తండ్రి లాంటి వారు. నా మీద ఎంతో వాత్సల్యాన్ని కనబరిచేవారు. మా ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ఆయనను ఆహ్వనించాము. ఆయన ఎంతో ఆనందంగా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. లతా మంగేష్కర్ పేరుతో ఓ మ్యూజిక్ అకాడమీ పెడితే ఆశ్చర్యం లేదు గానీ.. ఓ ఆసుపత్రి నిర్మించడం అంటే ఆశ్చర్యమే అని ఆయన అన్నారు. అయితే ఈ ఆసుపత్రి నడవాలంటే అందరూ రోగాల బారిన పడాలని తాను కోరుకోనని.. అందరూ చల్లగా ఉండాలనే కోరుకుంటున్నానని అన్నారు. ఆయన ప్రసంగాలన్నీ చాలా ఆదర్శవంతంగా ఉంటాయి. ఆయన ప్రసంగాల నుండి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు" అని లతా మంగేష్కర్ తెలిపారు. 

Trending News