కుమారస్వామి సర్కార్‌కి డెడ్ లైన్ విధించిన బిఎస్ యడ్యూరప్ప!

కుమారస్వామి సర్కార్‌కి డెడ్ లైన్ విధించిన బిఎస్ యడ్యూరప్ప!

Last Updated : Jul 21, 2019, 04:50 PM IST
కుమారస్వామి సర్కార్‌కి డెడ్ లైన్ విధించిన బిఎస్ యడ్యూరప్ప!

బెంగళూరు: కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన 15 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో ఆ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. వీలైనంత త్వరగా కర్ణాటక అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ప్రభుత్వం బల నిరూపణ చేసుకోవాల్సిందిగా బీజేపి నేత, మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప పట్టుబడుతూ వస్తున్నారు. ఇప్పటికే అవిశ్వాస తీర్మానాన్ని చేపట్టాల్సిందిగా ఆ రాష్ట్ర గవర్నర్‌ రెండు సందర్భాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆదేశించినప్పటికీ.. కర్ణాటక సర్కార్ మాత్రం అవిశ్వాస తీర్మానాన్ని వాయిదా వేస్తూ వస్తోంది. 

ఇదిలావుండగా రేపటి సోమవారం కాంగ్రెస్‌, జేడీఎస్‌ సంకీర్ణ సర్కార్‌ అవిశ్వాస తీర్మానానికి సిద్ధంగా ఉండాలని యడ్యూరప్ప సూచించారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్‌ ఆదేశాలను ముఖ్యమంత్రి కుమారస్వామి పట్టించుకోవట్లేదు. కర్ణాటకలో ఎవరి బలం ఏమిటో సోమవారం తేలిపోనుంది. స్పీకర్‌, సీఎం, సీఎల్పీ నేత రేపటి అవిశ్వాస తీర్మానానికి సిద్ధంగా ఉండాలి. రేపే కుమారస్వామి సర్కార్‌కు ఆఖరి రోజు అని హెచ్చరించారు. 

ఈ సందర్భంగా అవిశ్వాస తీర్మానంలో భాగంగా అసెంబ్లీలో నిర్వహించే ఓటింగ్‌ విషయంలో ఎమ్మెల్యేలను బలవంతం చేయొద్దని సుప్రీం కోర్టు పేర్కొందని యడ్డీ గుర్తుచేశారు. అంతేకాకుండా రాజీనామా చేసిన 15 మంది ఎమ్మెల్యేలపై కాంగ్రెస్‌ పార్టీ ఎలాంటి ఒత్తిడికి పాల్పడొద్దని... ఎమ్మెల్యేలకు కాంగ్రెస్‌, జేడీఎస్‌ పార్టీలు జారీ చేసిన విప్‌కు ఎలాంటి అధికారాలు ఉండబోవని యడ్యూరప్ప స్పష్టంచేశారు.

Trending News