మహిళల వస్త్రధారణపై ఓ కేరళ టీచర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు జీన్స్ వేసుకుంటే వారికి పుట్టే పిల్లలు ట్రాన్స్జెండర్లుగా మారుతారని ఓ టీచర్ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. పిల్లల్లో ఆటిజానికి కూడా వారి తల్లులు పురుషుల్లా వ్యవహరించడమే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. కేరళకు చెందిన రజత్ అనే ఉపాధ్యాయుడు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, పిల్లలు ట్రాన్స్జెండర్లుగా మారడానికి, అటిజంతో బాధపడటానికి వారి తల్లితండ్రులే బాధ్యులవుతున్నారని వ్యాఖ్యానించారు.
'స్త్రీలు ఎప్పుడైతే తమ స్త్రీతత్వాన్ని, పురుషుడు పురుషతత్వాన్ని దిగజార్చుతారో వారికి పుట్టే పిల్లలు ట్రాన్స్జెండర్లుగా, ఆటిజం బాధితులుగా జన్మిస్తారు' అని పేర్కొన్నారు. కాలడిలోని ఓ ప్రభుత్వ కళాశాల లెక్చరర్ అయిన రజత్ కుమార్ చేసిన అశాస్త్రీయ, లైంగిక వివక్షతతో కూడిన వ్యాఖ్యలపై పెనుదుమారం రేగింది. ఈ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు, పౌరసమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రజత్ వ్యాఖ్యలపై కలకలం రేగడంతో ఆయనను తమ కార్యక్రమాలకు ఆహ్వానించరాదని అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలను కోరుతూ కేరళ విద్యా మంత్రి కేకే శైలజ ప్రకటన జారీ చేశారు. గతంలోనూ ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.