చెన్నై: తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత స్టాలిన్‌తో తెంలగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, ప్రస్తుత జాతీయ రాజకీయాలు, కేంద్రంలో బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కేసీఆర్ వెంట టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు వినోద్ కుమార్, సంతోష్ కుమార్ ఉన్నారు.
గత వారమే తమిళనాడు, కేరళ రాష్ట్రాల పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్.. అదే సమయంలో స్టాలిన్‌ను కలిసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న స్టాలిన్ ఈ నెల 13న తన ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించారని, స్టాలిన్ ఆహ్వానం మేరకే ఇవాళ కేసీఆర్ వెళ్లి ఆయనను కలిశారని తెలుస్తోంది. గత వారం కేరళ పర్యటనకు వెళ్లినప్పుడే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో భేటీ అయి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించారు.
గతంలో ఇలాగే ఓసారి వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన కేసీఆర్.. ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జి, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, మాయావతి వంటి వారిని కలుసుకుని ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు అంశాలపై చర్చించారు. ఇక ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు ముగింపునకు వస్తున్న నేపథ్యంలో మరోసారి ఆయన తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రానున్న రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని గట్టిగా భావిస్తున్న కేసీఆర్.. అదే విషయాన్ని తాను కలిసిన, తనను కలిసిన నేతలు అందరికీ చెబుతూ వస్తున్నారు.