కథువా హత్యాచార ఘటనలో కీలక ఆధారాలను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) సేకరించింది. చిన్నారి శరీర భాగాలు, లభించిన రక్త నమూనాలు నిందితుల డీఎన్ఏతో సరితూగాయని ఢిల్లీ ఫోరెన్సిక్ ల్యాబ్ (డీఎఫ్ఎల్)తెలిపింది. ఆలయంలోనే అత్యాచారం జరిగిందని, హత్య తరువాత బాలిక దుస్తులను ఉతికి ఆధారాలు లేకుండా తుడిచారని వెల్లడించింది.
‘హత్య తర్వాత బాలిక దుస్తులు ఉతికారు. తల నుంచి పాదాల దాకా తుడిచేశారు. ఆధారాలను కనుగొనడంలో ఇబ్బందులు వచ్చాయి. దీంతో ఆలయంలో లభించిన రక్తనమూనాలు, వెంటుక్రలు ఎవరివనేవి తేల్చలేకపోయాం. ఆ తర్వాత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతితో ఢిల్లీ ఫోరెన్సిక్ ల్యాబ్ (డీఎఫ్ఎల్) సహాయం తీసుకున్నాం.డీఎఫ్ఎల్.. మృతురాలి శరీరభాగాలు, ఒంటిపై లభించిన రక్తపు నమూనాలను విశ్లేషించి, వాటిని నిందితుల డీఎన్ఏతో సరిపోల్చగా దాదాపు ఖచ్చితమైన ఆధారాలు లభించినట్లైంది’’ అని సిట్ అధికారులు పేర్కొన్నారు. కాగా.. జమ్ము కాశ్మీర్‌లోని కథువా జిల్లాకు కొత్త ఎస్పీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఎస్పీగా ఉన్న సులేమాన్ చౌధరి స్థానంలో శ్రీదర్ పాటిల్‌ను ఎస్పీగా నియమించారు. అటు సూరత్ హత్యాచారం కేసులో చిక్కుమూడి వీడింది. నిందితులు బాలికను దళారీల వద్ద నుండి కొనుగోలు చేసి లైంగికంగా హింసించి, తరువాత హత్య చేసినట్లు అధికారులు తెలిపారు.