Karnataka Budget 2023: రైతుల ఆదాయాన్ని పెంచి.. వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రతియేటా ఆర్థిక సాయం అందించేందుకు నాలుగేళ్ల క్రితం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. పీఎం కిసాన్ పథకం అన్ని రాష్ట్రాల్లో అమలు అవుతుండగా.. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా రైతుల కోసం అనేక స్కీమ్‌లు అమలు చేస్తున్నాయి. ఈ ఏడాది కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర బీజేపీ సర్కారు గుడ్‌న్యూస్ ప్రకటించింది.
రైతులకు ఆర్థికంగా సాధికారత కల్పించేందుకు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై బడ్జెట్‌లో భారీ ప్రకటన చేశారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆయన.. రైతులను ఆదుకునేందుకు తనవంతు ప్రయత్నం చేశారు. రైతులకు ఇచ్చే వడ్డీలేని లోన్ లిమిట్‌ను రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుందని చెప్పారు. ఆర్థిక వ్యవహారాల శాఖను బసవరాజ్ బొమ్మై తన వద్దే ఉంచుకున్న విషయం తెలిసిందే.
అసెంబ్లీలో ఆయన బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ.. వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలకు అవాంతరాలు లేని, అవసరాల ఆధారిత లోన్ సౌకర్యం కల్పించామని తెలిపారు. ఈ ఏడాది 30 లక్షల మందికి పైగా రైతులకు రూ.25 వేల కోట్ల రుణాలు పంపిణీ చేస్తామని ప్రకటించారు. కొత్త పథకం 'భూ శ్రీ' కింద 'కిసాన్ క్రెడిట్ కార్డ్' హోల్డర్లకు 2023-24 సంవత్సరంలో రూ.10 వేల అదనపు సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
'భూ శ్రీ' పథకం కింద అన్నదాతలకు అవసరమైన సమయంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఇతర వ్యవసాయ సామాగ్రి కొనుగోలుకు ప్రభుత్వం సాయం చేస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.2,500, నాబార్డు రూ.7,500 నిధులు ఖర్చు చేస్తాయని చెప్పారు. ఈ పథకం వల్ల రాష్ట్రంలోని 50 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు.
కర్ణాటక బడ్జెట్‌లో 'శ్రమ శక్తి' పథకాన్ని కూడా సీఎం బొమ్మై ప్రకటించారు. ఈ పథకం కింద భూమిలేని మహిళా వ్యవసాయ కూలీలకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా ప్రతి నెలా ఒక్కొక్కరికి రూ. 500 ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి తర్వాత తొలిసారిగా రెవెన్యూ రాబడుల అంచనా రెవెన్యూ వ్యయం కంటే రూ.402 కోట్లకు మించి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. ఇది 'ఆదాయం-మిగులు'బడ్జెట్ అని తన ప్రసంగంలో పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook