Income tax returns: ఐటీఆర్ దాఖలు చేయలేదా..గడువు తేదీ ముగిసిపోతుందనే ఆందోళనలో ఉన్నారా..అయితే మీకు గుడ్ న్యూస్. ఐటీఆర్ దాఖలు చేసేందుకు గడువు తేదీని మరోసారి పొడిగించారు.
ఇన్కంటాక్స్ రిటర్న్స్ ( Income tax returns ) దాఖలు చేయలేకపోయారని బెంగ పడవద్దు. గడువు తేదీ మరోసారి పొడిగించారు. 2019-20 ఆర్ధిక సంవత్సరపు రిటర్న్స్ ను జనవరి 10 వరకూ పొడిగిస్తూ కేంద్ర ఆర్ధిక శాఖ ( Central finance ministry ) నిర్ణయం తీసుకుంది. ఆడిట్ అవసరం లేని వారికి జనవరి 10 వరకూ గడువు ఉంది. ఆడిట్ అవసరమున్న వ్యాపార సంస్థలు, కంపెనీలకు జనవరి 31 వరకూ ఉన్న గడువు తేదీని ఫిబ్రవరి 15 వరకూ పొడిగించారు. ట్యాక్స్ ఆడిట్ నివేదికల సమర్పణకు జనవరి 15 వరకూ తాజాగా అవకాశం కల్పించింది.
ఐటీ రిటర్న్స్ దాఖలులో తగ్గుదల కన్పించడం, కరోనా కారణంగా నిబంధనల నేపధ్యంలో కేంద్ర ఆర్ధిక శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వివాద్ సే విశ్వాస్ ( Vivad se viswas ) పథకం కింద డిక్లరేషన్ గడువును ప్రభుత్వం జనవరి 31 వరకూ పొడిగించింది. 2019-20 ఆర్ధిక సంవత్సరపు వార్షిక జీఎస్టీ రిటర్న్స్ గడువును మాత్రం ఫిబ్రవరి 28 వరకూ పొడిగించింది.