యూనియన్ బడ్జెట్ పై కొన్ని ఆసక్తికర విషయాలు..!!

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ 2018-2019 ఆర్థిక సంవత్సరానికి గానూ పార్లమెంట్‌లో ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

Last Updated : Jan 31, 2018, 05:14 PM IST
యూనియన్ బడ్జెట్ పై కొన్ని ఆసక్తికర విషయాలు..!!

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ 2018-2019 ఆర్థిక సంవత్సరానికి పార్లమెంట్‌లో ఫిబ్రవరి1వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా బడ్జెట్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం..!!

* భారతదేశంలో మొట్టమొదటిసారిగా బడ్జెట్‌ను 1860లో ప్రవేశపెట్టారు. బ్రిటీష్ఇండియాలో అప్పటి ఆర్థికమంత్రిగా పనిచేసిన విల్సన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 

* స్వతంత్ర భారతావనిలో బడ్జెట్‌ను తొలిసారి నవంబర్ 26, 1947లో అప్పటి ఆర్ధికమంత్రి షణ్ముఖం చెట్టి ప్రవేశపెట్టారు. 

* భారతదేశంలో అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత మొరార్జీ దేశాయ్‌ది. ఆయన పదిసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 29న (1967, 1968లలో) మొరార్జీ తన జన్మదినం రోజున బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. పి.చిదంబరం 9 సార్లు, ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 

* 1969లో ప్రధాని ఇందిరా గాంధీ..ఆర్థిక మంత్రిత్వ శాఖను టేకోవర్ చేసుకొని.. తొలిసారి బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టారు. ఒక మహిళ ఆర్థికమంత్రిగా పనిచేసిన ఘనత ఆమెకే దక్కుతుంది. ఇప్పటివరకు ఇందిరా గాంధీ మినహా ఏ ఒక్కరూ ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టలేదు.    

* ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత దక్కుతుంది. ప్రధానులుగా నెహ్రూ, ఇందిర, రాజీవ్‌లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 

* 1997-98 ఆర్థిక సంవత్సరంలో 'డ్రీం బడ్జెట్'  పేరుతో ఆర్థికమంత్రి పి.చిదంబరం బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టారు. ఆర్ధిక విధానాల్లో తీసుకున్న మార్పులన్నింటినీ ఆ బడ్జెట్ లో పొందుపరిచారు.  

* బడ్జెట్‌ను సాధారణంగా ఫిబ్రవరి నెల చివరి రోజున (పార్లమెంట్ పనిదినాల్లో) సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు. కానీ వాజ్‌పేయి హయాంలో ఉదయం 11 గంటల నుండి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ప్రారంభించారు. 

* గత సంవత్సరం అనగా.. 2017లో రైల్వే బడ్జెట్‌ను కూడా సాధారణ బడ్జెట్‌లో చేర్చారు. 92 ఏళ్లుగా వస్తున్న పార్లమెంట్ సాంప్రదాయానికి వీడ్కోలు చెప్పారు. 

* సంప్రదాయానికి విరుద్ధంగా బడ్జెట్‌ను నెలరోజుల ముందే ప్రవేశపెట్టడం.. 2017 నుంచి ప్రారంభించారు. 2018 బడ్జెట్‌లో కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. 

* బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ఒకరోజు ముందు హల్వా వేడుక జరుగుతుంది. ఈ వేడుకల్లో ఆర్ధికమంత్రి స్వయంగా పాల్గొంటారు. బడ్జెట్ రూపకర్తలకు, సిబ్బందికి హల్వా పంచుతారు. బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ఒకరోజు ముందు నోరు తీపి చేసుకోవడం సంప్రదాయం. 

* బడ్జెట్ పత్రాలను బడ్జెట్‌కు వారం రోజుల ముందే ముద్రిస్తారు. ఢిల్లీలోని నార్త్ బ్లాక్, సెంట్రల్ సెక్రటేరియట్‌లో వీటిని ముద్రిస్తారు.

Trending News