పాట్నా: బీహార్లోని చాప్ర రైల్వే స్టేషన్లో మంగళవారం 16 మానవ పుర్రెలు, 34 అస్తిపంజరాలు బయటపడిన వైనం కలకలం సృష్టించింది. ఈ కేసులో తూర్పు చంపారన్ జిల్లాకు చెందిన సంజయ్ ప్రసాద్ అనే నిందితుడిని గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ) బృందం అరెస్ట్ చేసినట్టు రైల్వే డిప్యూటీ ఎస్పీ తన్వీర్ అహ్మెద్ వెల్లడించారు. తన్వీర్ అహ్మెద్ మీడియాతో మాట్లాడుతూ.. చాప్రా రైల్వే జంక్షన్లో జరిపిన సోదాల్లో సంజయ్ ప్రసాద్ నుంచి 16 మానవ పుర్రెలు, 34 అస్తిపంజరాలు, భూటాన్ కరెన్సీ నోట్లు, వివిధ దేశాలకు చెందిన ఏటీఎం కార్డులతోపాటు విదేశీ సిమ్ కార్డును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
ఉత్తర్ ప్రదేశ్లోని బల్లియా నుంచి తాను ఈ పుర్రెలు, అస్తిపంజరాలు కొనుగోలు చేశానని, ప్రస్తుతం వీటిని తీసుకుని పశ్చిమ బెంగాల్ మీదుగా భూటాన్ వెళ్లబోతున్నానని సంజయ్ ప్రసాద్ తమ విచారణలో అంగీకరించినట్టు తన్వీర్ అహ్మెద్ చెప్పారు. సంజయ్ ప్రసాద్ని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు మొదలుపెట్టారు.