హైదరాబాద్: ఆడుతూ పాడుతూ సరదాగా గడపాల్సిన వయస్సు అది... కానీ అవేం పట్టవట ఆ బుడతడికి. పదుమూడేళ్ల హమీష్ ఫిన్లేసన్కు బిజినెస్ ఆలోచనలు తప్పితే మరేవీ తన మెదడులో మెదలవట. తన ఆలోచనలకు పదునుపెట్టి గేమింగ్ అండ్ అవేర్నెస్ పై యాప్లు రూపొందించాడు. ఇలా తాను రూపొందించిన యాప్లను ప్రదర్శించి ప్రపంచం దృష్టిలో పడ్డాడు. వివరాల్లోకి వెళ్లినట్లయితే... హైదరాబాద్లోని హెచ్ఐసీసీ వేదికగా ప్రపంచ పారిశ్రామిక సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పదమూడేళ్ల హమీష్ ఫిన్లేసన్ గేమింగ్ అండ్ అవేర్నెస్పై తాను రూపొందించిన యాప్లను ప్రదర్శించాడు .ముఖ్యంగా తాబేళ్లను పరిరక్షించే ప్రాజెక్టులో ఇప్పటివరకు ఐదు యాప్లను హమీష్ అభివృద్ధి చేశాడు. ప్రస్తుతం ట్రాఫిక్ నియమాల గురించి అవగాహన కల్పించేందుకుగాను ఆరవ యాప్ను రూపొందించే పనిలో ఉన్నాడు. కాగా ఈ సదస్సులో అతి పిన్నవయస్కుడైన పారిశ్రామికవేత్తగా హమీష్ ఫిన్లేసన్ క్రెడిట్ దక్కించుకున్నాడు. యంగ్ పారిశ్రామికవేత్త హమీష్ ఫిన్లేసన్ ప్రజంటేషన్ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.