వరుణ దేవుడి కరుణ కోసం 41 యజ్ఞాలు చేయిస్తున్న ముఖ్యమంత్రి

వరుణ దేవుడి కరుణ కోసం

Last Updated : May 25, 2018, 12:25 AM IST
వరుణ దేవుడి కరుణ కోసం 41 యజ్ఞాలు చేయిస్తున్న ముఖ్యమంత్రి

వరుణ దేవుడి కరుణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా వున్న 33 జిల్లాల్లో 41 యజ్ఞాలు చేపట్టేందుకు సిద్ధం అవుతోంది గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం. మే 31వ తేదీన 33 జిల్లాలతోపాటు ప్రధాన నగరాల్లో 41 పర్జన్య యజ్ఞాలు చేసేందుకు ఆ రాష్ట్ర సర్కార్ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ యజ్ఞాల ద్వారా వరుణ దేవుడి ఆశీస్సులు లభించి రానున్న వర్షా కాలంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ విశ్వసిస్తున్నట్టు తెలుస్తోంది. అన్నట్టు గడిచిన నెల రోజులుగా రాష్ట్రంలోని అన్ని చెరువులు, కుంటలు, కాలువల్లో పూడికతీత పనులు సైతం చేయించింది అక్కడి రాష్ట్ర ప్రభుత్వం. వచ్చే వర్షా కాలంలో వర్షాలు భారీగా కురిస్తే, ఆ వర్షపు నీరు వృధాకాకుండా వుండేందుకే గుజరాత్ సర్కార్ ఈ పూడికతీత పనులకు నడుం బిగించింది. బుధవారం సమావేశమైన కేబినెట్.. రాష్ట్రంలో వర్షాల కోసం యజ్ఞయాగాలు చేపట్టాలనే విషయంపై ఓ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. 

కేబినెట్ భేటీ అనంతరం గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ మాట్లాడుతూ.. మే 31న రాష్ట్రంలో 41 యజ్ఞయాగాలు జరగనున్నాయని, ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, మంత్రులు, జిల్లాల్లో ఉన్నతాధికార యంత్రాంగం ఈ యజ్ఞాల్లో పాల్గొంటారని స్పష్టంచేశారు. ఈ వేసవిలో తీవ్రమైన నీటి ఎద్దడి సమస్య ఎదుర్కుంటున్న రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటి అనే సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక జలాశయాల్లో నీటి వనరులు అడుగంటుతుండటం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది.

Trending News