పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన ‘గజ’ మరో మారు తీరం దాటింది. తమిళనాడులోని నాగపట్నం-వేదారణ్యం ప్రాంతాల మధ్య ఈ రోజు ఉదయం 2.30 గంటలకు ఈ తుఫాను తీరం దాటినట్లు సమాచారం. ఈ క్రమంలో తమిళనాడుతో పాటు దక్షిణ కోస్తా ప్రాంతాల్లో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ‘గజ’ తుఫాను వల్ల రాబోయే 24 గంటల్లో పెద్ద ముప్పే పొంచి ఉందని వాతావరణ శాఖ సమాచారం అందివ్వడంతో.. తమిళనాడు సర్కారు పలు ప్రాంతాల్లో హై ఎలర్ట్ ప్రకటించమని సంబంధిత అధికారులను ఆదేశించింది.
ఇప్పటికే నాగపట్నం, తిరువారూర్, రామనాథపురం చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో ముందస్తు చర్యల్లో భాగంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ యంత్రాంగాన్ని కూడా సిద్ధంగా ఉండమని తెలిపింది. అదేవిధంగా ఏడు జిల్లాల్లోని పాఠశాలలు, కాలేజీలకు సెలవులు మంజూరు చేస్తున్నామని కూడా ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే ‘గజ’ తుఫాను తీరం దాటిందని వార్తలు రావడంతో పలు చోట్ల కరెంటు కోతను కూడా విధించారు.
ప్రభుత్వ సూచనల మేరకు రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే తమిళనాడు చేరుకున్నాయి. తుఫాను సూచన అందింది కాబట్టి.. తిరువూరు, తంజావూరు ప్రాంతాలకు వెళ్లే రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే భారతీయ రైల్వే అధికారులు తెలిపారు. దక్షిణ ఆంధ్రలో కూడా పలు ప్రాంతాల్లో ఈ తుఫాను ప్రభావం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం గమనార్హం. ముందస్తు చర్యల్లో భాగంగా తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే.. హెలికాప్టర్ల ద్వారా ఆహారం, నిత్యవసరాలు ప్రజలకు అందివ్వడానికి సిద్ధమవ్వాలని అధికారులకు తెలియజేయడం జరిగింది.