జైట్లీ 'ఎన్నికల' బడ్జెట్‌లో ఈ అంశాలే ఉండబోతున్నాయ్..!

కేంద్రబడ్జెట్‌కు ఇంకా కొద్దిసమయం మాత్రమే ఉంది. 2019లో బిజేపీ అధికారంలోకి రావాలంటే ఈ బడ్జెట్ ఎంతో కీలకమైంది. 

Last Updated : Jan 31, 2018, 05:15 PM IST
జైట్లీ 'ఎన్నికల' బడ్జెట్‌లో ఈ అంశాలే ఉండబోతున్నాయ్..!

కేంద్రబడ్జెట్‌కు ఇంకా కొద్దిసమయం మాత్రమే ఉంది. 2019లో బిజేపీ అధికారంలోకి రావాలంటే ఈ బడ్జెట్ ఎంతో కీలకమైంది. ఎంతోమంది ఆశావహులు ఈ బడ్జెట్ పై ఆశలు పెట్టుకున్నారు. ఆర్థిక మంత్రి కూడా ఈ బడ్జెట్‌ను సవాల్ గా స్వీకరించి.. నెల రోజుల ముందు నుంచే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో ప్రధానంగా ఏ ఏ అంశాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని చూసినట్లయితే.. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం జైట్లీ తన బడ్జెట్‌లో ఐదు ప్రధాన అంశాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 

1. వ్యవసాయం 

'వ్యవసాయం' దేశానికి వెన్నెముక వంటిది. వ్యవసాయంతో దేశ ఆర్థికవ్యవస్థ ముడిపడి ఉంది. దేశంలో అరవై శాతం మంది ప్రజల ముఖ్య జీవనాధారం వ్యవసాయమే. ఏ ప్రభుత్వమైనా వ్యవసాయాన్ని విస్మరించరాదు. ఈసారి బడ్జెట్‌లో ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయానికి అధికంగా నిధులు కేటాయించే అవకాశం ఉందని మంత్రిత్వశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ బడ్జెట్ జనరంజకంగా ఉండకపోవచ్చేమో గానీ కార్యసాధకంగా ఉండవచ్చని అభిప్రాయాన్ని తెలిపారు పేరు తెలపడానికి ఇష్టపడని ఒక అధికారి. 

2. బ్యాంకుల పునర్ వ్యవస్థీకరణ

నికర ఆస్తులు బ్యాంకుల పాలిట గండంగా మారాయి. కేంద్రం బ్యాంకులను ఆదుకోవడానికి రూ.2.11 లక్షల కోట్లు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే..! వాటిలో రూ.76 వేల కోట్ల రూపాయలను బడ్జెట్, బాండ్ల రూపేణా సమకూర్చనుంది. తాము అనుకున్న మొదటి మూడు లక్ష్యాలలో బ్యాంకింగ్ పునర్ వ్యవస్థీకరణ కూడా ఒకటని అరుణ్ జైట్లీ వెల్లడించిన సంగతి విదితమే..!    

3. మౌలిక సదుపాయాలు 

కేంద్రం మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈ రంగంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. నౌకా రంగం, రహదారులకు పెట్టుబడులు ఇస్తూనే.. రైల్వే రంగానికి కూడా భారీగానే నిధులు కేటాయించనుంది. రైల్వే స్టేషన్‌ల ఆధునీకరణ, బులెట్ ట్రైన్ కోసం కేంద్రం నిధులు సమకూర్చనుంది. 

4. కార్పొరేట్ పన్ను తగ్గింపు?

2015లో జైట్లీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పుడు.. కార్పొరేట్ పన్నును 30 నుంచి 25 శాతానికి తగ్గిస్తామని వెల్లడించారు. ఇప్పటికే మూడు బడ్జెట్‌లు అయిపోయాయి. ఇది చివరి బడ్జెట్. జైట్లీని కొంతమంది వ్యాపారవేత్తలు కలిసి ఈ అంశాన్ని గుర్తుచేశారు. మరి జైట్లీ వారిని కనికరిస్తారో లేదో చూడాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే..!!

5 . ఉద్యోగ కల్పన

దేశానికి పెను‌సవాల్‌గా ఉన్న నిరుద్యోగ శాతాన్ని తగ్గించాలంటే ఉద్యోగాల సృష్టి తప్పనిసరి. ఇప్పటికే ఉద్యోగాల కల్పనలో కేంద్రం విఫలమైందని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. కాబట్టి ఈసారి ఉద్యోగాల కల్పనకు సంబంధించి జైట్లీ ప్రసంగం నుంచి ఏదైనా రావచ్చని నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. మీడియా కధనాల ప్రకారం 'జాతీయ ఉపాధి పాలసీ'ని ప్రవేశపెట్టే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. జాతీయ స్థాయిలో నగదు బదిలీని చేపట్టాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Trending News