కోల్కతా మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కాలేజీలోని ఫార్మసీ డిపార్ట్మెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న వెంటనే 10 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది, కోల్కతా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలిసింది.
సిబ్బంది ఆస్పత్రిలోని సుమారు 250 మంది పేషెంట్లను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆస్పత్రిలోని పేషేంట్స్ అందరూ క్షేమంగా ఉన్నారన్న ఆస్పత్రి వర్గాలు.. 80 శాతం మందులు కాలిబూడిదయ్యాయని తెలిపారు.
అటు మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆస్తి నష్టానికి సంబంధించి అధికారులు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
కోల్కతా మేయర్, అగ్నిమాపక శాఖ మంత్రి మాట్లాడుతూ.. 'రోగులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాం. ఈ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. త్వరలో పరిస్థితి అదుపులోకి వస్తుంది' అని అన్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.