అమ్మాయిలు కూడా తాగుబోతులైతే ఎలా: గోవా సీఎం

"ఈ రోజుల్లో అమ్మాయిల తాగుడికి అద్దూ, ఆపు లేకుండా పోతోంది. వారు కూడా విపరీతంగా బీరు తాగుతున్నారు" అని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అభిప్రాయపడ్డారు.

Last Updated : Feb 10, 2018, 04:16 PM IST
అమ్మాయిలు కూడా తాగుబోతులైతే ఎలా: గోవా సీఎం

"ఈ రోజుల్లో అమ్మాయిల తాగుడికి అద్దూ, ఆపు లేకుండా పోతోంది. వారు కూడా విపరీతంగా బీరు తాగుతున్నారు" అని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అభిప్రాయపడ్డారు. గోవా రాష్ట్ర యూత్ పార్లమెంట్‌కు వచ్చిన ఆయన యువతను ఉద్దేశించి మాట్లాడారు. "నేను ఇక్కడ కూర్చుని ఉన్నవారి గురించి మాట్లాడడం లేదు. అందరి గురించి మాట్లాడుతున్నాను. నేడు అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా విపరీతంగా బీరుతో పాటు ఇతర మద్యపానీయాలను సేవిస్తున్నారు. ఇలాంటి విషయాల్లో ఎవరికి వారే హద్దులు పెట్టుకోవడం మంచిది. ప్రజాస్వామ్యం అంటే తాగి తందనాలాడడం ఒక్కటే కాదు కదా" అని ఆయన అన్నారు.

అలాగే డ్రగ్స్ మాఫియాపై కూడా ఆయన స్పందించారు "గోవాలో డ్రగ్స్ మాఫియాని పూర్తిగా నిషేధించగలరని నేను అనుకోవడం లేదు. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఇలాంటి విషయాల్లో కాలేజీ యువతపై పూర్తిస్థాయి నిఘా పెట్టాలి. అప్పుడే కట్టడి చేయగలం. నేను గతంలో ఇవే మాటలు చెబితే.. వెనువెంటనే 170 మందిని డ్రగ్స్ సేవిస్తున్న కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఇదే నిబద్ధత ఎల్లప్పుడూ ఉండాలి" అని పారికర్ అన్నారు. 

"మన చట్టాల ప్రకారం చాలా తక్కువ మొత్తంలో ఎవరైనా డ్రగ్స్ పుచ్చుకుంటే.. వారికి 15 రోజుల్లో బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి చట్టాల్లో మార్పులు రావాలి. ఏదైనా ఒక విధానాన్ని కట్టడి చేయాలంటే.. నిబంధనలు కూడా కట్టడి చేయాలి. అయితే గుడ్డిలో మెల్ల అన్నట్లు ప్రస్తుతం ఇలాంటి కేసుల్లో నిందితులు ఎవరో కనీసం తెలుసుకోగలుగుతున్నాం" అని పారికర్ అన్నారు. 

అలాగే ప్రభుత్వ ఉద్యోగాలపై కూడా స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగాలంటే.. కష్టపడకుండా ఏసీలో కూర్చొని కబుర్లు చెప్పుకునే ఉద్యోగాలు అనే భావన చాలామందిలో ఉంది. అందుకే కష్టపడకుండా సుఖపడడం కోసం పోస్టులు తక్కువున్నా.. క్వాలిఫికేషన్‌తో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ దరఖాస్తు చేస్తున్నారు. లోవర్ డివిజన్ క్లర్కు ఉద్యోగానికి సైతం హైయర్ క్వాలికేషన్ ఉన్నవారు అప్లై చేస్తున్నారు అని ఆయన అన్నారు. 

Trending News