బెంగళూరు: కర్ణాటకలో ఫిరాయించిన కాంగ్రెస్, జనతా దళ్(JDS)లకూటమికి చెందిన 15 ఎమ్మెల్యేల అసెంబ్లీ స్థానాలకు ఇటీవల ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 5న జరిగిన ఈ ఉప ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు నేడు వెల్లడవనున్నాయి. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 11 కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం.. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేసింది. కర్ణాటకలో బీజేపి ప్రభుత్వం భవిష్యత్ ఏంటనేది ఈ ఫలితాలతోనే తేలిపోనుంది. కాంగ్రెస్ - జనతా దళ్(ఎస్) కూటమికి చెందిన 17 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసిన తర్వాత జరిగిన ఈ ఉప ఎన్నికల ఫలితాలపై మొదటి నుంచీ తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసిన అనంతరం కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 225 నుంచి 208కి తగ్గింది. హైకోర్టులో కేసుల కారణంగా మిగిలిన 2 సీట్లకు ఎన్నికలు వాయిదా పడ్డాయి. బీజేపి అధికారం నిలబెట్టుకోవాలంటే 15 స్థానాల్లో కనీసం ఆరు స్థానాల్లో గెలవాలి.
ఇదిలా ఉండగా గెలుపుపై ఎవరికీ వారే ధీమా వ్యక్తం చేసినప్పటికీ.. నేడు మధ్యాహ్నం 12 గంటల వరకు వెల్లడైన ఫలితాల సరళిని పరిశీలిస్తే.. 12 స్థానాల్లో బీజేపి ముందంజలో ఉండగా, కాంగ్రెస్, జేడిఎస్‌లు చెరో రెండు స్థానాల్లో, ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ డికే శివకుమార్ ఈ ఉప ఎన్నికల ఫలితాలపై మాట్లాడుతూ.. పిరాయింపుదారులను ప్రజలు స్వాగతించారు. మేము ఈ ఓటమిని అంగీకరిస్తున్నాము. ఈ ఓటమితో కాంగ్రెస్ పార్టీకి ఏ ఇబ్బంది లేదని.. ఫలితాలు చూసి ఆవేదన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.