ఢిల్లీలో వర్షా కాలంలోనూ కొనసాగుతున్న అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత బారి నుంచి కొంత ఉపశమనాన్నిస్తూ గురువారం కురిసిన వర్షాలు నగరవాసులకు ఇంకొంత ఇబ్బందులను సైతం తీసుకొచ్చాయి. గురువారం కురిసిన వర్షాలకే నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా శుక్రవారం ఉదయం నుంచే ఢిల్లీ మరోసారి వర్షంలో తడిసి ముద్దయింది. గురువారం అర్ధ రాత్రి నుంచి కురిసిన వర్షం కారణంగా ఢిల్లీతోపాటు ఢిల్లీ శివార్లలోని నొయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఎన్సీఆర్ ప్రాంతాల్లోని వీధులన్నీ జలమయమయ్యాయి.
ప్రధాన రోడ్లపై వర్షపు నీరు పొంగి ప్రవహిస్తున్న దృశ్యాలు కనిపించాయి. గురువారం తరహాలోనే శుక్రవారం సైతం రోడ్లపై ట్రాఫిక్ జామ్ కావడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఉదయాన్నే ఉద్యోగాలకు వెళ్లే ఉద్యోగస్తులు, స్కూలు, కాలేజీ విద్యార్థులు తీవ్ర ఇక్కట్లపాలయ్యారు. గురువారం కురిసిన వర్షాలకు ఘజియాబాద్‌లోని వసుంధర ప్రాంతంలో రోడ్డు కుంగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో సంబంధిత అధికార యంత్రాంగం ఆ మార్గాన్ని మూసేసి మరమ్మతులు చేపట్టారు.
ఆర్టీఆర్ మార్గ్ - ఎయిర్ పోర్ట్, ఓక్లా మండి, సరిత విహార్, నొయిడాలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో ఆయా మార్గాల్లో వాహనాలను అనుమతించకుండా ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లేవిధంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు.